పగలు సర్పంచ్‌.. రాత్రి వాచ్‌మెన్‌గా.. అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు ..!

పగలు సర్పంచ్‌.. రాత్రి వాచ్‌మెన్‌గా.. అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు ..!
సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో ఉన్న ఇతని పేరు మల్లేష్. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఆరేపల్లి గ్రామానికి సర్పంచ్.

సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో ఉన్న ఇతని పేరు మల్లేష్. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఆరేపల్లి గ్రామానికి సర్పంచ్. ఇతను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈసారి సర్పంచ్ సీటు ఎస్సీకి రిజర్వు కావడంతో ఎక్కువమంది పోటీలో నిలిచారు. దీంతో ఎస్సీ కులస్తులు, గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థుల పేర్లను రాసి చిటీ తీయగా ఇరుసు మల్లేష్ పేరు వచ్చింది. దీంతో అతణ్ని సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేశారు.

గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠ ధామము, ప్రకృతి వనం వర్మీ కంపోస్ట్ షెడ్ నిర్మాణం వంటి పనులు సర్పంచ్‌ మల్లేష్‌ సొంత డబ్బులతో పూర్తి చేశారు. వీటికి సంబంధించి సుమారు 4 లక్షల వరకు ఖర్చయ్యాయి. కాగా ప్రభుత్వం ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో సర్పంచ్ అప్పుల పాలై తనకున్న రెండెకరాల్లో అర ఎకరం భూమిని అమ్ముకుని అప్పులన్నీ తీర్చేశాడు. గౌరవ వేతనంగా ఇచ్చే ఐదువేల రూపాయలు సైతం నెలనెలా ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ పోషణ కోసం జిల్లా కేంద్రంలోని అశోక్ టవర్స్‌లో రాత్రి వాచ్‌మెన్ గా విధుల్లో చేరాడు. ఉదయం పూట సర్పంచ్‌గా గ్రామంలో సేవలందిస్తూ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన చూసుకుంటున్నాడు.

గతంలో ఆరెపల్లి గ్రామం బర్దీపూర్ పంచాయతీ పరిధిలో ఉండేది. 2018 లో ఆరెపల్లి ని గ్రామ పంచాయతీగా ప్రకటిం చారు. ఇక్కడ ప్రస్తుతం గ్రామ జనాభా 434 కాగా, ఈ ప్రాతిపదికన గ్రామానికి నెలవారి ఎస్ఎఫ్‌సీ నిధులు 37 వేల రూపాయలు వస్తాయని తెలిపారు. అయితే, గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పెండింగ్ బిల్లులు రాకపోవడంతో పాటు మంజూరైన కొద్దిపాటి నిధులు కరెంటు బిల్లులు, గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలకే సరిపోతోందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో తనకున్న రెండెకరాల పొలంలో అరెకరం పొలం అమ్మేసి అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల విడుదల విషయమై జిల్లా కలెక్టర్‌కు సర్పంచ్‌ మల్లేష్‌ పలు సార్లు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. కానీ ఇచ్చిన హామీ మాటలకే పరిమిత మైందని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని వాపోయారు. అంతేకాక రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కూడా గ్రామ పరిస్థితిని వివరించగా ఆయన కూడా స్పందించ లేదన్నారు. దీంతో తానే తన పొలం అమ్మేసి బిల్లులు చెల్లించి, కుటుంబాన్ని పోషించుకోవడానికి రాత్రిళ్లు సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నానని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒక్క మల్లేష్‌‌ పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సర్పంచ్‌ల పరిస్థితి ఇలాగే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పులు తెచ్చి అభివృద్ధి పథకాలను పూర్తి చేసి.. నిధులు విడుదల కాక బాధపడుతున్న సర్పంచ్‌ల సంఖ్య చాలానే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వారి ఆదుకోవాలి డిమాండ్ వినబడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story