Siva Balakrishna: నేరాంగీకార పత్రంలో నమ్మలేని నిజాలు

Siva Balakrishna: నేరాంగీకార పత్రంలో నమ్మలేని నిజాలు
తమ్ముడి సహకారం, ఒక అధికారి సూచనలు ఉన్నట్టు వెల్లడి

రెరా మాజీ కార్యదర్శి బాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట నోరు విప్పేందుకు బాలకృష్ణ నిరాకరించినా.... ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయే నిజాలను చెప్పించారు. చేసిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా తమదైన శైలిలో అధికారులు వివరాలను రాబట్టారు. ఓ ఐఏఎస్ అధికారితో శివబాలకృష్ణకు ఉన్న సన్నిహిత సంబంధం... ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలు, పంపకాలు బినామీల పేర్లమీద కూడబెట్టిన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

HMDA, రెరాలో శివబాలకృష్ణ పనిచేసిన సమయంలో అధికారం అడ్డం పెట్టుకొని వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 8 రోజులపాటు తమ అదుపులోకి తీసుకొని విచారించిన ఏసీబీ అధికారులు.. అనేక విషయాలను రాబట్టగలిగారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆక్రమాలు చేయడంలో ఆరితేరిన బాలకృష్ణ తొలుత నోరు విప్పేందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఆయన హయాంలో ఇచ్చిన అనుమతులు, వాటి ద్వారా పొందిన లబ్ది, బినామీ ఆస్తులు, ఇతర అధికారులతో ఉన్న సంబంధాల వంటి వాటి గురించి అధికారులు తరచూ ప్రశ్నించారు. కానీ చాలా వాటికి శివబాలకృష్ణ మౌనంగా ఉన్నారని సమాచారం. దాంతో లాభం లేదని గ్రహించిన అనిశా అధికారులు బాలకృష్ణ హెచ్ఎండీఏ, రెరాలో వివిధ స్థిరాస్తి సంస్థలకు ఇచ్చిన అనుమతులకు సంబంధించి సమాచారం సేకరించారు. నిబంధనలు పక్కన పెట్టి అనుమతులు ఇవ్వడానికి గల కారణాల గురించి ఆరా తీశారు. దాంతో అప్పట్లో HMDAలో ఉన్నతస్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి సూచన మేరకు కొన్నింటికి అనుమతులు ఇవ్వాల్సి వచ్చిందని, ఇందుకు ప్రతిఫలంగా ఆ అధికారికి కొన్ని ఆస్తులతోపాటు పెద్దఎత్తున డబ్బు మట్టజెప్పినట్లు శివబాలకృష్ణ వెల్లడించినట్లు తెలిసింది. ముఖ్యంగా నార్సింగి, మహేశ్వరం.. తదితర ప్రాంతాల్లోని పలు స్థిరాస్తి సంస్థలతో ఈ లావాదేవీలు జరిగినట్లు తేలడంతో ఆ ఆస్తుల చిట్టా బయటకు లాగుతున్నారు.


శివబాలకృష్ణ బినామీ ఆస్తులు ఎవరిరెవరి పేరుమీద ఉన్నాయి. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు వంటి వివరాలు ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. స్థిరాస్తి సంస్థలకు అనుమతి, బినామీ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఒకే సమయంలో జరిగినట్లు అనిశా నిర్ధారించాల్సి ఉంటుంది. తద్వారా ఉపకారం చేసిన సంస్థలు ప్రతిఫలంగా వీటిని ముట్టజెప్పినట్లు నిర్ధారించినట్లు అవుతుంది. ఇందుకోసం స్థిరాస్తి సంస్థల ప్రతినిధులనూ విచారించనున్నారు. ఇది నిర్ధారణ అయ్యే పక్షంలో సంబంధిత ఐఏఎస్ అధికారిపైనా ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. శివబాలకృష్ణ అడ్డదారిలో కూడబెట్టిన ఆస్తుల సంరక్షణ వ్యవహారమంతా అతడి సోదరుడు శివనవీన్ కనుసన్నల్లోనే సాగిందని ఏసీబీ దర్యాప్తులో తేలింది.


Tags

Read MoreRead Less
Next Story