Telangana: నిజామాబాద్ జిల్లాలో అవిశ్వాసానికి తెర

Telangana:  నిజామాబాద్ జిల్లాలో అవిశ్వాసానికి తెర
రంజుగా మున్సిపల్ రాజకీయం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అవిశ్వాసానికి తెరలేచింది. ఇప్పటికే ఆర్మూర్ మున్సిపల్‌లో ఛైర్ పర్సన్‌పై రేపు అవిశ్వాసం సమావేశం ఏర్పాటు చేయనుండగా... త్వరలోనే కామారెడ్డిలో ఛైర్ పర్సన్‌పై కాంగ్రెస్, వైస్ ఛైర్ పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాలని యోచిస్తున్నాయి. మరికొన్ని మున్సిపాలిటీలు, సహకార సంఘాలలోనూ అవిశ్వాసానికి సమయం అసన్నమైనట్టే కనిపిస్తోంది.

కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ గడ్డం‌ ఇందుప్రియపై అవిశ్వాసం పెట్టేందుకు భారాస పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఓ వైపు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అధికార పార్టీ కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. దీంతో కామారెడ్డి మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీలో భారాస 23, కాంగ్రెస్ 12, భాజపా 8 స్థానాల్లో గెలుపొందగా.. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర కౌన్సిలర్లు అందరూ BRSలో పార్టీలో చేరడంతో మున్సిపల్ పీఠాన్ని భారాస కైవసం చేసుకుంది. ఛైర్ పర్సన్‌గా నిట్టు జాహ్నవి, వైస్ ఛైర్ పర్సన్‌గా గడ్డం ఇందుప్రియలు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 8 మంది, భాజపా నుంచి ఇద్దరు కౌన్సిలర్లు భారాసలో చేరడంతో మున్సిపల్‌లో ఆ పార్టీ బలం 39కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం మరో ఐదుగురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన వైస్ ఛైర్ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని BRS కౌన్సిలర్లు యోచిస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమం అనంతరం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో మున్సిపల్‌లో విలీనమైన గ్రామాలకు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరిని తన పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. తద్వారా తమ బలం పెంచుకుని ఛైర్ పర్సన్‌పై అవిశ్వాసం పెట్టి మున్సిపల్‌ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు.

ఆర్మూర్ పుర ఛైర్ పర్సన్ పండిత్ వినీతపై ఈనెల 4న అవిశ్వాస తీర్మాన సమావేశం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ వెల్లడించారు. గత నెల 12న 24 మంది కౌన్సిలర్లు పుర ఛైర్ పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. ఈనెల 4న జరగనున్న బల నిరూపణ తర్వాత వచ్చిన ఫలితాల మేరకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపడతారని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story