Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి

Summer : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి
రెండు మూడ్రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపిస్తున్నాయి. సమ్మర్ అంటే చాలు.. జనాలకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయ్. నిప్పులు కురిపిస్తుండటంతో రానున్న వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. మాడు పగిలిపోయే ఎండలు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు మూడ్రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరిగాయ్! సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు ! ఎండవేడికి జనాలు విలవిలలాడుతున్నారు. స్టార్టింగ్ లోనే ఈ రేంజ్‌లో సూర్యుడు మండిపోతున్నాడంటే, ముందు ముందు మంటలు పుట్టిస్తాడని ఆందోళన చెందుతున్నారు.


హైదరాబాద్‌లో 35.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 13న హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గరిష్టంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు అత్యధికంగా ఉష్ణోగ్రత ఇదే. ఇక ఆదిలాబాద్‌లో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్‌లో 21 రోజుల్లో 35పై ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లోనూ తెలుగురాష్ట్రాల్లో వేడి కొనసాగుతుంది. కొన్ని చోట్ల 39.9 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉంది. వారం రోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.


వాతావరణ ప్రభావం వల్ల ఏటా ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువవుతున్నాయి. ఉత్తర భారతంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండొచ్చంది.ఏప్రిల్, మే నెలల్లో ఎండల ప్రభావం ఉండేది. కానీ ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎండ మంట పెరగడం ప్రారంభమైంది. దీనికి తోడు మే నెలలో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటే అవకాశం ఉందట. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది వేడి ఎక్కువగా ఉంటుందంటున్నారు. పగటిపూట వేడిగానూ, రాత్రిపూట చల్లగానూ ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వేసవి మరింత మండనుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశాలున్నాయి.


రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాలు, ఆవర్తన ద్రోణులు, అల్ప పీడనాల ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో వాతావరణం వేడెక్కుతోంది. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గాలిలో తేమశాతం కూడా తగ్గిపోతుండడంతో ఉక్కపోతలు మొదలయ్యాయి. మరో మూడు నెలల పాటు ఎండాకాలం కొనసాగనుంది. అప్పుడే గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరింది. మున్ముందు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story