యూపీలో పోలీసుల తీరును నిరసిస్తూ టీకాంగ్రెస్ మెరుపు ధర్నా

ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత బాలిక హత్య ఘటన... అనంతర పరిణామాలు... హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు కారణమయ్యాయి. యూపీలో బీజేపీ ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆందోళనకు దిగడం ఘర్షణకు దారితీసింది. హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్న తీరుపై టీపీసీసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ పట్ల బీజేపీ సర్కారు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అదే సమయంలో బీజేపీ కార్యాలయం వద్ద ఉన్న బీజేపీ యువ మోర్చా నేతలు కాంగ్రెస్ నేతలపై దాడికి దిగారు. అలాగే కొందరు బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు పార్టీల నేతల్ని అరెస్ట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం, యూపీ సర్కారు తీరును నిరసిస్తూ... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతత్వంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి క్యాండిల్ ర్యాలీ చేపట్టేందుకు బయల్దేరగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీస్ వాహనాలకు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు దారుణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాహుల్ గాంధీ పట్ల యూపీ పోలీసుల వైఖరి... తెలంగాణలోని రెండు జాతీయ పార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోటా పోటీ ధర్నాలు, నిరసనలతో ఒక్కసారిగా నగరంలో రాజకీయం వేడెక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com