TS: ప్రభుత్వానికి-పార్టీకి మధ్య అనుసంధానం

TS: ప్రభుత్వానికి-పార్టీకి మధ్య అనుసంధానం
ప్రతీ పదిహేను రోజులకోసారి గాంధీభవన్‌లో అందుబాటులో ముఖ్యమంత్రి, మంత్రులు..

తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య అంతరం తగ్గించేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని TPCC నిర్ణయించింది. ప్రతి పదిహేను రోజులకొసారి ముఖ్యమంత్రి, వారంలో రెండురోజులు మంత్రులు గాంధీభవన్‌లో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజాభవన్‌లో వారానికి రెండ్రోజులు ప్రజల నుంచి వినతులు సేకరిస్తున్నట్లు గాంధీభవన్‌లోనూ వారంలో రెండు రోజులు పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో వేగం తగ్గింది. కొత్త ప్రభుత్వం కావడంతో పరిపాలనపై పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజువారీ సమీక్షలతో సీఎం, అమాత్యులు తీరిక లేకుండా గడుపుతున్నారు. పార్టీకార్యక్రమాలపై ఆశించిన స్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారనే భావన పార్టీ శ్రేణులనుంచి వ్యక్తమవుతోంది. కార్యకర్తలు, శ్రేణులకు PCC అధ్యక్షుడు, ఇతర నాయకులు అందుబాటులో లేకపోవడం ఆ ప్రభావం పార్టీపై స్పష్టంగా కనపడుతోంది.


పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నదున అధిష్ఠానం ఆదేశాల మేరకు పార్టీని బలోపేతంచేసే దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. పార్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని PCC సారథి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ప్రజాభవన్‌లో ప్రజావాణి తరహాలోనే గాంధీభవన్‌లోనూ... పార్టీ కోసం కాంగ్రెస్ వాణి నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రతి 15 రోజులకు ఓసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌లో అందుబాటులో ఉండనున్నారు. మూడుగంటల పాటు కాంగ్రెస్ నేతలు పార్టీ శ్రేణులనుంచి వినతులు స్వీకరిస్తారు. పార్టీపరంగావచ్చే విజ్ఞప్తులని ఎప్పటికప్పుడుపరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. శ్రేణుల నుంచి వచ్చే వినతులను పార్టీ యంత్రాంగం ద్వారా సమస్యలను పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటారు. TPCC కార్యవర్గంలో చర్చించి మార్గదర్శకాలను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.


మరోవైపు.... రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం... సంచలనంగా మారింది. ఈ సమయంలో సీఎం రేవంత్‌ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. సీఎంతో ప్రకాశ్‌గౌడ్‌ భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ప్రకాశ్‌గౌడ్‌ ఇంటికి వచ్చి కలిశారు. ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని ఆయనను మంత్రి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో భేటీ కాగా.. అది రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. వారు కాంగ్రెస్‌లో చేరుతారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో.. అలాంటిదేమీ లేదంటూ ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఖండించారు.

Tags

Read MoreRead Less
Next Story