TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌
శుభవార్త చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్‌... 53 వేల మంది ఉద్యోగులకు లబ్ధి

తెలంగాణ RTC ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న PRC కలను ప్రభుత్వం సాకారం చేసింది. 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌.. సర్కారు నిర్ణయంతో దాదాపు 53 వేల ఉద్యోగులకు మేలు కలుగుతుందని వివరించారు. బస్సులు తగ్గిస్తున్నారంటూ కొందరు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలవుతుందని స్పష్టంచేశారు. 2017లో అప్పటి ప్రభుత్వం 16 శాతం PRCఇచ్చిందని.. ఆ తర్వాత మళ్లీ ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతనసవరణ చేయాల్సి ఉన్నా .. భారాస సర్కారు పట్టించుకోలేదని... అందుకే ఈసారి ఆర్టీసీ ఉద్యోగులకు మంచి ఫిట్‌మెంట్‌ ఇచ్చినట్లు వివరించారు. RTCఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు.


ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చే ఉద్దేశంతోనే మహాలక్షీ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ఇప్పటివరకు 25 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. 21శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆర్టీసీ తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టీసీలో ఉద్యోగులకు నాలుగేళ్లకు ఓసారి వేతన సవరణ జరిగే విధానం ఉంది. 2017, 2021..రెండు వేతన సవరణలు అమలవ్వాలి. 2017కు సంబంధించి గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 16 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది. వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. శనివారం రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ 21 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. 2017 ఏప్రిల్‌ 1 నుంచి ఫిట్‌మెంట్‌ బకాయిలు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో అందజేస్తామని ఆర్టీసీ పేర్కొంది. ఆ మొత్తాన్ని వడ్డీ లేకుండా చెల్లిస్తామని స్పష్టం చేసింది. తాజా ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీపై ఏడాదికి రూ.418 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని అంచనా. ప్రస్తుతం సంస్థలో 42,057 మంది సర్వీసులో ఉన్నారు. వారితో పాటు 2017 ఏప్రిల్‌ 1 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మరో 11,014 మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తం 53,071 మందికి ఆర్థిక ప్రయోజనం కలగనుంది.

Tags

Read MoreRead Less
Next Story