TS: నేడు సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల

TS: నేడు సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల
సమయాన్ని మార్చడంపై ప్రతిపక్షాల ఆగ్రహం.... ఎక్కువమంది పాల్గొనేలా చేసేందుకే అన్న తెలంగాణ సర్కార్‌

తెలంగాణలో సాగునీటి రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల నేటికి వాయిదా పడింది. శ్వేతపత్రాన్ని ఇవాళే విడుదల చేసి చర్చించాలని అజెండాలో పొందుపర్చి, తీరా రేపటికి వాయిదా వేయడంపై విపక్షాలు నిరసన తెలిపాయి. అయితే ముఖ్యమైన అంశంపై చర్చలో వీలైనంత ఎక్కువ మంది పాల్గొనేలా నేటికి వాయదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా.. సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. వాస్తవానికి శాసనసభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి చర్చ చేపట్టాల్సి ఉన్నా ఎక్కువ మంది సభ్యులు పాల్గొనేలా శనివారం చర్చకు తీసుకోవాలని భావించిన పాలకపక్షం... ఈ ప్రతిపాదనను సభాపతి వద్దకు తీసుకెళ్లింది. ఎజెండాలో ఉన్నందున తక్షణం చర్చించాలని బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కోరాయి. కాసేపటికి సభ సమావేశం అవగానే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య.. నీటిపారుదలపై నేడు చర్చ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దశలో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారాస సభ్యుడు హరీష్ రావు అభ్యంతరం చెప్పారు. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని లేదా వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. సభాపతి పరిశీలిస్తామని చెప్పిన తర్వాత అన్ని పక్షాల అభిప్రాయాన్ని తీసుకున్నారు.


ఎజెండాలో ఉన్న నీటిపారుదలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని..రాత్రి అయినా చర్చిద్దామని బీఆర్‌ఎస్‌ సభ్యుడు హరీష్ రావు అన్నారు. రోజూ BACని సమావేశపర్చలేమన్న శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి శ్రీధర్ బాబు... ముఖ్యమైన అంశం అయినందున సమయం తీసుకుని శనివారం చర్చకు తీసుకోవాలని అన్నారు. అనంతరం సభాపతి ప్రసాద్ కుమార్ సభను శనివారానికి వాయిదా వేశారు. నీటిపారుదల అంశంపై చర్చలో వీలైనంత ఎక్కువమంది పాల్గొంటామని సభ్యులు కోరుతున్నందున నేడు BAC నిర్వహించి అజెండా ఖరారు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌ను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story