TS: ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ అభివృద్ధి

TS: ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ అభివృద్ధి
బీఆర్‌ఎస్‌ నేతలు అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారన్న తెలంగాణ మంత్రులు... కవితవి అనవసర విమర్శలని మండిపాటు

ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గత పాలకులు పేదల కష్టాన్ని, అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. మహిళలను అందలమెక్కిస్తూ పాలన అందిస్తుంటే ఓర్వలేక MLC కవిత అనవసర విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు అమాత్యులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలో ఇంఛార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతక‌్కలతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని K-హబ్, పీవీ నరసింహరావు విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. షెడ్యూల్ తెగల విద్యార్థినులకు వసతి గృహాన్ని ప్రారంభించారు. KU ప్రహారి గోడ, సమ్మయ్యనగర్‌ రహదారుల విస్తరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి 258కోట్ల రూపాయల ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు.


విద్యార్థుల ఉద్యమం వల్ల సాధించిన రాష్ట్రంలో నిరుద్యోగులను భారాస సర్కార్‌ విస్మరించిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఏడాదిలో లక్ష ఉద్యోగాలిస్తామన్న హామీ మేరకు...70రోజుల్లోనే 30వేల పైచిలుకు ఉద్యోగాలిచ్చినట్లు స్పష్టం చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ, పొంగులేటితో కలిసి సీతక్క దివ్యాంగులకు వీల్‌ఛైర్స్‌ , కల్యాణలక్ష్మీ చెక్కులు అందించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో పార్టీల కతీతంగా రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ వివరించారు. లక్ష వృక్షార్చనలో భాగంగా మంత్రులు పొంగులేటి, సీతక్కతో కలిసి రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. వచ్చే మూడేళ్లలో వరంగల్‌ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.


పనిచేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ను తిప్పికొట్టాలని అమాత్యులు కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని కేయూలో రూ.68 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సర్కారు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారు మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోందని చెప్పారు. ‘ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. భారాస అధికారంలోకి వస్తే తాను సీఎం కావాలని ఆమె భావించారు. పార్టీ ఓటమితో ఆశలన్నీ గల్లంతయ్యాయి. మహిళలను కాంగ్రెస్‌ నుంచి దూరం చేయాలని కవిత యత్నిస్తున్నారు. జీవో నంబర్‌ 3కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఆ జీవో ఇచ్చిందే కేసీఆర్‌ సర్కారు. భారాస తప్పుడు ప్రచారం బంద్‌ చేసి.. నిర్మాణాత్మక విపక్షంగా పనిచేయాలి’ అని సీతక్క తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story