TS: నేడు మేడిగడ్డలో మంత్రుల బృందం పర్యటన

TS: నేడు మేడిగడ్డలో మంత్రుల బృందం పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పర్యటన.... మేడిగడ్డలో పటిష్ట బందోబస్తు...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఇవాళ మేడిగడ్డలో పర్యటించనుంది. శాసనసభ నుంచి బస్సుల్లో రోడ్డు మార్గాన మేడిగడ్డ బయలుదేరనున్నారు. సీఎం, ప్రజాప్రతినిధుల పర్యటనల నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వీఐపీల రాకను పురస్కరించుకుని మేడిగడ్డ పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఆరోపిస్తున్న అధికార కాంగ్రెస్‌ ఈ విషయాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లే కార్యాచరణకు సిద్ధమైంది.


ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, శాసనసభ, మండలి సభ్యుల మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. గత ఏడాది నవంబర్ 2న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో కలసి రేవంత్‌రెడ్డి బ్యారేజీని సందర్శించారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో రావడం ఇదే తొలిసారి. ఉదయం పది గంటలకు అసెంబ్లీ ప్రారంభమయ్యాక మేడిగడ్డ వెళ్లనున్నట్లు ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి బస్సుల్లో బయలదేరుతారు. మధ్యాహ్నం మూడు మూడున్నర గంటల మధ్యలో సీఎం ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు చేరుకుంటారు. తర్వాత సాగునీటి శాఖ ఛీఫ్ ఇంజనీర్ విజిలెన్స్ డిజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఐతే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినప్పటికీ.. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యం వల్ల కాళేశ్వరం దెబ్బతిన్న విషయాన్ని పర్యటనలో వివరిస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెలిపారు.


మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ పిల్లర్స్‌ను సీఎం నేతృత్వంలోని బృందం పరిశీలించనుండటంతో అక్కడికి వెళ్లేందుకు వీలుగా... అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద సభ స్థలాన్ని చదును చేశారు. ముఖ్యమంత్రి బృందంతో పాటు ప్రముఖులు 3వేల మంది కూర్చోవడానికి వీలుగా సభా ప్రాంగణం సిద్ధం చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లేలా పూర్తిస్థాయిలో రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు దాదాపు 800 మందితో పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ లో పిల్లర్లు గత ఏడాది అక్టోబర్ 21న కుంగాయి. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతి, నిధులు దుర్వినియోగం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఆరోపించింది. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాతే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ చేపట్టింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.

Tags

Read MoreRead Less
Next Story