TG: తెలంగాణలో చురుగ్గా ధాన్యం కొనుగోళ్లు

TG: తెలంగాణలో చురుగ్గా ధాన్యం కొనుగోళ్లు
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని ఆదేశాలు.. 5,923 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లు వెల్లడి

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతోంది. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు జరపాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల సౌకర్యార్థం ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 5వేల923 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది యాసంగి వరిపంటకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వరికోతలు ప్రారంభం కావడంతో....కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది. రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు నెలకొల్పేందుకు చర్యలు చేపడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ముందుగానే ప్రారంభించింది. దీంతో రైతుల నుంచి వడ్లు సేకరణ ప్రశాంతంగా జరుగుతోంది.


గతేడాది యాసంగిలో ఈ సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కనీసం ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 వేల 149 కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. అయితే ఇప్పటివరకూ 5 వేల 422 కేంద్రాలను ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా కేంద్రాలను తెరిచేందుకు సన్నద్ధమైనట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వడ్లు కొనుగోలు చేయాలని పౌరసరఫరాల అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 4వేల345 మంది రైతుల నుంచి, 31వేల 215 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది మొత్తంలో దాదాపు 75. 40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత ఆహార సంస్థ నుంచి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకుని ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. వీటిని రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story