TS: ఇష్టారాజ్య డ్రైవింగ్‌.. 13 వేల లైసెన్స్‌లు రద్దు

TS: ఇష్టారాజ్య డ్రైవింగ్‌.. 13 వేల లైసెన్స్‌లు రద్దు
తెలంగాణ రవాణశాఖ అధికారుల కఠిన చర్యలు... డ్రంకెన్‌ డ్రైవ్‌పై నజర్...

ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడిపితే సహించేదిలేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రవాణాశాఖ స్పష్టం చేస్తోంది. ప్రజల ఉసురు తీస్తున్న రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ఎదుటివారి చావుకి కారకులైతున్న వారిపై నజర్‌ పెట్టారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు తాగి వాహనాలు నడిపే వారికి భారీజరిమానాలు విధిస్తున్నారు. పదేపదే పట్టుబడినా తీరుమారని వారి లైసెన్స్‌లు రద్దు చేయాలని రవాణాశాఖకు ట్రాఫిక్ పోలీసులు నివేదించారు. స్పందించిన రవాణాశాఖ గత ఏడాదిలో ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడిపిన వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ విధంగా రద్దు చేసిన లైసెన్స్‌లను తిరిగి ఆర్నెళ్ల వరకు పునరుద్ధరించే అవకాశం ఉండదని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.


లైసెన్స్‌ల రద్దులో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఉన్నాయి. తొలిసారితాగి వాహనం నడిపి పట్టుబడితే 10వేల జరిమానా, ఆర్నెళ్ల జైలుశిక్ష విధిస్తారు. రెండోసారి అదేనేరం చేస్తే 15వేల అపరాధ రుసం రెండేళ్ల కారాగారం పడే అవకాశం ఉంది. సదరు వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లను ఆరు నెలలు రద్దు చేస్తారు. అతివేగం, రేసింగ్‌కి పాల్పడే వారికి మొదటిసారి అయితే 5వేలు జరిమానా మూణ్నెళ్ల జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి దొరికితే 10వేలు జరిమానా, ఏడాది కారాగారం ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల నుంచి రవాణాశాఖకు ప్రతిపాదనలు రాగానే వాహనదారులకు షోకాజ్ నోటీసు ఇచ్చి....... వారి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తామని అధికారులు తెలిపారు.

ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.... రవాణాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై రవాణశాఖప్రత్యేక దృష్టసారించింది. ప్రమాదాలకు కారకులైన 13 వేల మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దుచేసింది. అందులో అత్యధికంగా డ్రంకెన్‌ డ్రైవ్ కేసులే అని అధికారులు పేర్కొంటున్నారు.

రవాణాశాఖ గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈనెల 22 వరకు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినవాహనదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 765 లైసెన్స్‌లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో అత్యధికంగా డ్రంక్ డ్రైవ్ కేసులు 7,564, ప్రమాదాలకు కారణమైన వారివి 783 వరకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున ప్రతినెలకు సుమారు 1,147 లైసెన్స్‌లను రవాణాశాఖ సస్పెండ్ చేస్తోంది. 70శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిబంధనల ప్రకారమే వాహనాలు నడపాలని రవాణశాఖ అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story