TS VOTERS: కోటీన్నర ఓటర్లు 30 నుంచి 49 ఏళ్ల మధ్య వారే

TS VOTERS: కోటీన్నర ఓటర్లు 30 నుంచి 49 ఏళ్ల మధ్య వారే
ఓటు హక్కు వినియోగించుకోనున్న 3 కోట్ల 26 లక్షల మంది... పురుషులు కోటీ 62 లక్షలు... స్త్రీలు కోటీ 63 లక్షలు

తెలంగాణలోని మొత్తం ఓటర్లలో 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్నవారి సంఖ్య ఏకంగా కోటిన్నరకుపైగా ఉంది. 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్నవారే మూడొంతులకుపైగా ఉన్నారు. మొదటిసారి ఓటు హక్కు పొందిన యువ ఓటర్లు దాదాపు పది లక్షల వరకు ఉన్నారు. ఈనెల 30న తెలంగాణ ఓటర్లు తమ తీర్పును EVMలలో నిక్షిప్తం చేయనున్నారు. ఎన్నికల్లో మూడు కోట్లా 26 లక్షలా 2799 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు కోటీ 62 లక్షలా 98 వేలా 418 మంది, మహిళలు కోటీ 63 లక్షలా 1,705 మంది ఉన్నారు. ఇతరులు 2,676 మంది ఉన్నారు. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్న వారి సంఖ్య దాదాపు పది లక్షల వరకు ఉంది. ఓటర్ల జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 9 లక్షల 99 వేల 667.


మొదటిసారి యువ ఓటర్లు ఎక్కువ మంది తమ ఓటుహక్కు నమోదు చేసుకున్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 64 లక్షలా 36 వేలా 335గా ఉంది. తెలంగాణ ఓటర్లలో 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న వారిసంఖ్య అధికంగా ఉంది. మొత్తం మూడు కోట్లా 26 లక్షలకుపైగా ఓటర్లు ఉండగా అందులో 30 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారే 92 లక్షలా 93 వేలా 393 మంది ఉన్నారు. 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 66 లక్షలా 96 వేలా 89గా ఉంది. ఈ రెండు వయస్సుల వారిని కలిపితే వారి కోటిన్నర దాటుతుంది. మొత్తం మూడు కోట్లా 26 లక్షలకుపైగా ఓటర్లలో 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య కోటీ 59 లక్షలా 89 వేల 482గా ఉంది. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఉన్నారు. వారికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారిని కూడా కలిపితే ఆ సంఖ్య ఏకంగా రెండు కోట్లా 24 లక్షలా 25 వేలా 817గా ఉంది. అంటే మూడో వంతు ఓటర్లు 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు వారే ఉన్నారు.

ఇక 50 నుంచి 59 ఏళ్ల మధ్య 45 లక్షలా 66 వేలా 306 మంది.. 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయస్సువారు 27 లక్షలా 72 వేలా 128 మంది ఉన్నారు. 70 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 13 లక్షలా 98 వేలా 511 గా ఉంది. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య నాలుగు లక్షలా 40 వేలా 371. రాష్ట్రంలో మొదటిసారి పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మొత్తం 119 నియోజకవర్గాలకుగాను ఏకంగా 76 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. 33 జిల్లాలకుగాను 26 జిల్లాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story