Telangana Rains : జలదిగ్బంధంలో తెలంగాణ గ్రామాలు

Telangana Rains : జలదిగ్బంధంలో తెలంగాణ గ్రామాలు
Telangana Rains : తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దారులన్నీ ఏరులై పారుతున్నాయి.

Telangana Rains : తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ముసురుపట్టి కురుస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో కుంభవృష్టిగా పడుతున్నాయి. దారులన్నీ ఏరులై పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ సహా ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటింది.

మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాలు, వరదలపై సమీక్షించిన సీఎం కేసీఆర్.. అవసరమైన చోట తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓవైపు రుతు పవనాలు.. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తెలంగాణ అంతటా అలుముకున్న దట్టమైన మేఘాలు కుంభవృష్టిని వర్షిస్తున్నాయి. కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా నాన్‌స్టాప్‌గా దంచికొడుతున్న భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి.

వరదల కారణంగా నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా.. లోతుట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. కొన్నిచోట్ల చెరువుల కట్టలు తెగి ఊళ్లను ముంచెత్తాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ముంపులోనే మునుగుతున్న బాధిత గ్రామాల ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు.

నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో రహదాదారుల కొట్టుకుపోయాయి. మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. బైంసా పట్టణ సమీపంలో ఉన్న గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. పట్టణంలోని కొన్ని కాలనీలు నీట మునిగాయి.

ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉందని అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. ఇటు ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట, తుంపల్లి, వట్టవాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఇటు ఉమ్మడి, నిజామాబాద్‌, కరీంనగర్ జిల్లాల్లో అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు భారీ చెట్లు నేలకూలాయి. వంతెనలపై నుండి నీరు ప్రవహిస్తుండడంతో ధర్మపురి-జగిత్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాయపట్నం బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో పాతబ్రిడ్జి మునిగిపోయింది. గోదావరి నదీపరివాహక ప్రాంతాల్లోని ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. నాగర్‌ కర్నూలు జిల్లాలో రోడ్లన్నీ ఏరులై పారుతున్నాయి. రామగిరి-రఘుపతిపేట మధ్య బ్రిడ్జి నిర్మిస్తే వర్షాకాలం తిప్పలు తప్పుతాయని జనం అంటున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాల్లో బొగత జలపాతం వద్ద జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మేడారంలోని జంపన్నవాగు పొంగి పొర్లుతోంది. లక్నవరం సరస్సు వద్ద నీటిమట్టం 26 అడుగులకు చేరింది. నాగారం మండలంలో దయ్యాల వాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఎలిషెట్టిపల్లి, కొత్తూరు మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. మేడి వాగు, జీడివాగు, బొగ్గుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

బయక్కపేట వెలే గ్రామం వద్ద మహిళ.. పెరిగిన నీటి ఉధృతిలోనే మూడు నెలల పసికుందును అరచేతిలో పట్టుకుని మోకాల లోతు నీటిలో వరద ప్రవాహానికి ఎదురెళ్లి అవతలి ఒడ్డుకు చేరుకుంది. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని వంకవాగు, పాండవుల జలపాతం కనువిందు చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం రుద్రారం చెరువుకు గండి పడింది. దీంతో వరద నీరు వృధాగా పోతోంది.

ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు జలవిలయాన్ని సృష్టిస్తున్నాయి. భద్రాచలం దగ్గర అంతకంతకూ గోదావరి వరద పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నాయి. గోదావరి ఉగ్రరూపంతో ప్రాణనష్టం జరగకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బూర్గంపాడ్‌లో ఒకటి, సారపాకలో 3 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని కిన్నెరసాని, మల్లన్న, ఏడుమెలికల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయపాడు వద్ద కిన్నెరసాని డేంజర్‌ లెవల్‌ ప్రవాహంతో గండిపడకుండా కర్రలు, ఇసుక బస్తాలతో అడ్డుకట్టవేశారు. బండిపాడు-డోర్నకల్‌, దుమ్ముగూడెం, ఖమ్మం- మహబూబాబాద్‌ మధ్య, సజ్జలబోడు సమీపంలోని ఐదు గ్రామాలకు, సంపత్‌నగర్‌ నుంచి కొత్తగూడెం వరకు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు భారీ వర్షాలతో ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో పనులు నిలిచిపోయాయి. భారీగా వర్షపు నీరు చేరడంతో జేకే 5 ఉపరితల బొగ్గుగనిలో మట్టి వెలికితీత పనులు ఎక్కిడక్కడ ఆగిపోయాయి. కోయగూడెం OBCలో 50వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవటంతో సింగరేణికి భారీ నష్టం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

మరో రెండ్రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌... క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని ఆరా తీస్తున్నారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ రక్షణ చర్యలపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story