Telangana:కొత్త పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి..విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

Telangana:కొత్త పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి..విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన
ఈ నెల 14 నుంచి 24 దాకా నిరసనలను ఉద్ధృతం చేసి.. 24న విద్యుత్‌ సౌధలో మహా ధర్నా చేయాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయం

కొత్త పీఆర్‌సీని తక్షణం అమలు చేయాలని కోరుతూ తెలంగాణలో విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. సంస్థల కార్యాలయాల ఎదుట గత కొన్ని రోజులుగా వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14 నుంచి 24 దాకా నిరసనలను ఉద్ధృతం చేసి.. 24న విద్యుత్‌ సౌధలో మహా ధర్నా చేయాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది. అప్పటికీ సంస్థల యాజమాన్యాలు దిగిరాకపోతే నిరవధిక సమ్మె చేపట్టాలని సంఘాలు యోచిస్తున్నాయి. వేతన సవరణ అంశంపై సంఘాలతో చర్చించేందుకు ఇవాళ జేఏసీ, టీజాక్‌ నేతలతో విద్యుత్‌ సంస్థల సీఎండీలు సమావేశం నిర్వహించబోతున్నారు.

రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల్లో 30 వేల 956 మంది ఉద్యోగులు, మరో 20 వేల 201 మంది తాత్కాలిక ఉద్యోగులు, 20 వేల 509 మంది పింఛన్‌దారులున్నారు. వీరందరికీ 2022 ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త పీఆర్‌సీ అమలు చేయాలని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కొత్త పీఆర్‌సీపై యాజమాన్యాలు ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ.. వేతనాలను 5 శాతం పెంచాలని సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. అయిదేళ్ల కిందట 35 శాతం పీఆర్‌సీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌... ఇప్పుడు 36 శాతమైనా ఇవ్వకపోతారా అని ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి. జీతభత్యాలు, పింఛన్లన్నీ కలిపి ఇప్పుడు ఉన్న వాటికన్నా అదనంగా ఒక శాతం పెంచినా ఏటా 30 కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతుందని.. 36 శాతం ఇస్తే ఏటా ఒక వెయ్యి 80 కోట్ల ఆర్థిక భారం పడుతుందని యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.

అటు.. ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీకి, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాబోయే రెండేళ్లపాటు కరెంటు ఛార్జీల పెంపునకు ప్రభుత్వం అంగీకరించే ఛాన్సుండదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఛార్జీలు పెంచకుండా జీతాలను 36 శాతం పెంచితే సంస్థలు మరింత నష్టాల్లో కూరుకుపోతాయని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం నెలనెలా జీతాలు చెల్లించేందుకూ విద్యుత్‌ సంస్థలు అప్పులు చేస్తున్నాయి

Tags

Read MoreRead Less
Next Story