Telangana: గవర్నర్‌పై పిటిషన్‌.. ఏప్రిల్‌ 10కి వాయిదా వేసిన సుప్రీం

Telangana: గవర్నర్‌పై పిటిషన్‌.. ఏప్రిల్‌ 10కి వాయిదా వేసిన సుప్రీం
బిల్లులను గవర్నర్‌ దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

శాసనసభ బిల్లులను ఆమోదించినా.. గవర్నర్‌ దీర్ఘకాలంగా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణ ఏప్రిల్‌ 10వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ జేబీ పార్డీవాలాల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ అంశంపై వాదనలు వినిపించగా.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నందున తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేయాలని తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌దవే దాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం పిటిషన్‌లో పేర్కొన్న పది బిల్లులు గత ఏడాది సెప్టెంబరు నుంచి గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ బిల్లులన్నింటినీ అసెంబ్లీ పాస్‌ చేసిందని, అలాంటప్పుడు జాప్యం ఎందుకని దుష్యంత్‌ దవే పేర్కొన్నారు. ఈకేసులో సొలిసిటర్‌ జనరల్‌కు సుప్రీంకోర్టు ఇప్పటికే వారం సమయం ఇచ్చిందని గుర్తుచేశారు. ఏ విషయం రేపటికల్లా చెప్పేలా సూచించాలని కోరారు. అయితే తాను గవర్నర్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని, అందువల్ల విచారణను 10కి వాయిదా వేయాలన్నారు తుషార్‌ మెహతా. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం విచారణ వచ్చే నెల 10కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story