TPCC: నేడే కాంగ్రెస్‌ మూడో జాబితా!

TPCC: నేడే కాంగ్రెస్‌ మూడో జాబితా!
కొలిక్కి వచ్చిన అభ్యర్థుల జాబితా... రెండు చోట్ల నుంచి బరిలో రేవంత్‌రెడ్డి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌ అభ్యర్ధుల మూడో జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కొడంగల్‌, కామారెడ్డి రెండు స్థానాల నుంచి బరిలో దిగనున్నారు. సిరిసిల్ల, పటాన్‌చెరు, సూర్యాపేట, నారాయణఖేడ్‌ నియోజక వర్గాల అభ్యర్ధుల ఎంపికపై పీఠముడి పడడంతో కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయానికి వదిలేసినట్లు తెలుస్తోంది. వామపక్షాల సీట్ల విషయంలో స్పష్టత వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు విడతల్లో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌... మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ... కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వామపక్షాలతో పొత్తులు, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధుల విషయంలో కూడా కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం రాకపోవడంతో మూడో జాబితా ప్రకటనలో జాప్యం జరుగుతూ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వామపక్షాలతో చర్చించినట్లు తెలుస్తోంది. సీపీఎం, సీపీఐలకు ఒక్కో టికెట్, ఒక ఎమ్మెల్సీ ఇచ్చేట్లు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కానీ వామపక్షాలు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించడం లేదు.


ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనుండడంతో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా కొడంగల్‌తోపాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. షబీర్‌ అలీని కామారెడ్డి నుంచి పోటీలో నిలపాలని పార్టీ భావించగా.... ఆయన విముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు పోటీగా నిలిచేందుకు ప్రత్యామ్నాయ నాయకులు ఎవ్వరు లేకపోవడంతో ఏఐసీసీ అనుమతితో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డినే బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో కామారెడ్డి నుంచి దూరమవుతున్న మాజీ మంత్రి షబీర్‌ అలీని నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


మిగిలిన 15 నియోజక వర్గాలల్లో జుక్కల్ నుంచి లక్ష్మీకాంతం, బాన్సువాడ నుంచి ఏనుగు రవీంద్ర రెడ్డి, కామారెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ మంత్రి షబీర్‌ అలీ, కరీంనగర్ నుంచి శ్రీనివాస్‌, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌ రెడ్డి... కానీ తీన్మార్‌ మల్లన్నను బరిలో దించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నారాయణఖేడ్ నుంచి సురేష్‌ షెట్కర్‌, సంజీవ్‌ రెడ్డిలు ఇద్దరు కూడా టికెట్‌ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. పటాన్‌చెరు నుంచి నీలం మధు, శ్రీనివాస్‌ గౌడ్‌ల మధ్య టికెట్ కోసం హోరాహోరీ పోటీ నెలకొంది. సూర్యాపేట నుంచి పటేల్‌ రమేష్‌ రెడ్డి, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్‌ రెడ్డిలు గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ నియోజక వర్గాలకు చెందిన అభ్యర్ధుల ఎంపిక విషయంలో.... నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. తుంగతుర్తి నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కానీ.. అద్దంకి దయాకర్‌ కానీ బరిలో దించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వ్యక్తి రవి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లందు నుంచి బలరాం నాయక్‌, డోర్నకల్ నుంచి డాక్టర్‌ రామచంద్రనాయక్‌, సత్తుపల్లి నుంచి మానవతారాయ్‌ని లేదా ఆయన సతీమణిని బరిలో దింపే పరిస్థితులు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అశ్వరావుపేట నుంచి సున్నం నాగమణి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లులలో ఒకరిని బరిలో దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story