BJP: బీజేపీ మేనిఫెస్టో ఇంధ్రధనుస్సు!

BJP: బీజేపీ మేనిఫెస్టో ఇంధ్రధనుస్సు!
బుధవారం అభ్యర్థుల తొలి జాబితా విడుదల... ప్రజల్లోకి కమలదళం

తెలంగాణలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ కసరత్త్తును మరింత ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించిన బీజేపీ బుధవారం తొలిజాబితా విడుదల చేయనుంది. అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించేలా కసరత్తు చేస్తున్న కమలం పార్టీ మేనిఫెస్టోకు ఇంద్ర ధనుస్సు అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ధీటుగా ఏడు ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాని నరేంద్రమోదీనే గ్యారంటీ అంటూ బీజేపీ ఎన్నికల ప్రణాళిక ప్రకటించనుంది. బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యమయ్యేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరో మూడ్రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టి వరకు తొలి జాబితా వస్తుందని అంతా భావించినా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రానికి చెందిన అభ్యర్ధులపై ఎలాంటి చర్చ చేయలేదని సమాచారం. రేపో, మాపో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. 60మందితో బుధవారం తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అభ్యర్థులపై ఎంపికపై కసరత్తు చేస్తున్న బీజేపీ కేంద్రమంత్రులు, జాతీయ నేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.


ప్రజల్ని ఆకర్షించేలా ఎన్నికల ప్రణాళికను బీజేపీ సిద్ధం చేస్తోంది. అన్ని వర్గాలకు చెందిన అంశాలు పొందుపరిచేలా.. మేధావులు, నిపుణుల సలహాలు సూచనలు స్వీకరిస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి సమావేశమై కసరత్తు చేసింది. బీసీల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టాల్సిన సంక్షేమ పథకాలపై చర్చించేందుకు బూరనర్సయ్యగౌడ్‌ నేతృత్వంలోని ఉపకమిటీ సమావేశమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామగ్రామన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొననున్నట్లు తెలిసింది.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు, ఇంటింటికి నల్లాకనెక్షన్ల ద్వారా 24 లుగు గంటలు ఉచితంగా సురక్షితమైన తాగునీరు, కులవృత్తులకు ఉచితకరెంట్‌ ఇవ్వాలని భావిస్తోంది. రజక, నాయిబ్రాహ్మనుల లాండ్రి, సెలూన్లకి ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచితకరెంట్ అందిస్తోంది. ఆ పథకాన్ని రజక, నాయిబ్రాహ్మనులు, వడ్రంగి, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులు, చిరువ్యాపారులకు వర్తింపచేయాలనియోచిస్తోంది. మెట్రోరైలు, RTCబస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ఎస్సీ కాలనీలు, మురికివాడల్లో ఆస్తిపన్ను మాఫీ హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కర్షకులతోపాటు కౌలు రైతులుకి... రైతు రైతుబంధు, బీమాసౌకర్యం, ఫించన్లు కొనసాగింపు మహిళలకు పావలా వడ్డీ రుణాలు, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాల్లో పారదర్శకత పాలన అందించేలా భాజపా ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story