KCR: మళ్లీ కేసీఆర్ సెంటిమెంట్ ఉద్యమం

KCR: మళ్లీ కేసీఆర్ సెంటిమెంట్ ఉద్యమం
జిల్లాల నేతలతో విడిగా సమావేశంలో కేసీఆర్‌

కృష్ణాజలాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణ ప్రయోజనాల కోసం చేపడుతున్న ఉద్యమమని BRS అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ బహిరంగ సభకు అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా దృష్టి సారించాలని గ్రామాల్లో చర్చించేందుకు వీలుగా యువత ఎక్కువగా తరలివచ్చేలా చూడాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన KCR కాంగ్రెస్ నేతలే కొట్టుకుంటారని హామీలు అమలు చేయకపోతే ప్రజలు తిరగబడతారన్నారు.

కృష్ణా నదీ పరివాహక ప్రాంత నేతలతో సమావేశమైన భారత రాష్ట్ర సమితి అధినేత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఫలితాలు, మార్పులను ఆయన సమావేశంలో ప్రస్తావించారు. వ్యవసాయ రంగానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చామని... సాగునీరు, విద్యుత్‌తో పాటు రైతు సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సాగులేక ఖాళీగా ఉన్న భూములను కూడా సాగు దిశగా చేసేలా చర్యలు తీసుకున్నామని... దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని తెచ్చామని వివరించారు. నదీ జలాల విషయంలో రాజీలేని పోరాటం చేశామని, కేంద్రానికి ఎక్కడా తలొగ్గలేదని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన ఉందో, లేదోనన్న ఆయన... కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించడం ద్వారా రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆక్షేపించారు. విషయంపై దృష్టి సారించకుండా దూషిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. పాలన చేతకాక తనపై కారు కూతలు కూస్తున్నారని మండిపడిన KCR... ఇటువంటి వాళ్లను ఎంతో మందిని చూశానన్నారు.


నల్గొండ సభ అడ్డుకుంటాననేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరని KCR ప్రశ్నించారు. సభను అడ్డుకునేది ఎవరని.ఎట్లా పెట్టుకోనివ్వరో చూద్దామని అన్నారు. నల్గొండ సభ కోసం వెంటనే దరఖాస్తు చేయాలని నేతలను ఆదేశించిన భారాస అధినేత... అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని నేతలకు స్పష్టం చేసిన గులాబీ దళపతి 12 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. మిగిలిన నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని ప్రతి మండలం నుంచి సభకు ప్రాతినిథ్యం ఉండాలని KCR సూచించారు. వీలైనంతవరకు సభకు యువత వచ్చేలా చూడాలని... వారి ద్వారా గ్రామాల్లో చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. నల్గొండ సభ కంటే ముందే వీలును బట్టి నియోజకవర్గ, మండల స్థాయిలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story