Telangana BRS: బీఆర్‌ఎస్‌లో మొదలైన టికెట్ల హడావుడి

Telangana BRS: బీఆర్‌ఎస్‌లో మొదలైన టికెట్ల హడావుడి
సిట్టింగుల్లో ఎక్కడలేని టెన్షన్‌ మొదలైంది


అధికార బీఆర్‌ఎస్‌లో అప్పుడే టికెట్ల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేల జాబితా సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి గెలిచే సత్తా ఉన్నవారికే కేసీఆర్‌ టికెట్లు కేటాయిస్తున్నట్టు చెబుతున్నారు. అభ్యర్థుల వడపోతపై అధినేత పెద్ద కసరత్తే ప్రారంభించారు. అభ్యర్థుల జాబితా సిద్ధమవుతుందన్న ప్రచారంతో... సిట్టింగుల్లో ఎక్కడలేని టెన్షన్‌ మొదలైంది. టికెట్‌పై ఆశలు పెట్టుకున్నవారు మరోసారి అవకాశం వస్తుందో..రాదో అని ఆందోళన చెందుతున్నారు.

అభ్యర్థుల జాబితాను అధినేత కేసీఆర్‌ త్వరలో ప్రకటిస్తారని నేతలు ఎదురుచూస్తున్నారు. శ్రావణమాసంలో మంచి రోజులు మొదలు కానుండటంతో సిట్టింగ్‌లు, ఆశావహుల్లో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. అయితే మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గెలిచే సత్తా ఉన్నవారికే టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కేసీఆర్‌ ఒకేసారి 105 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఉండడం..ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై కేసీఅర్ ఆచితూచి వ్యవరిస్తున్నారు. ఈసారి ఒకేసారి అభ్యర్థుల పేర్లు ప్రకటించే పరిస్థితి లేదని...పార్టీ నేతలు కూడా చెబుతున్నారు.

మొత్తం మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మొదటి జాబితాలో పక్కాగా గెలిచే 60మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.ఈ అభ్యర్థుల లిస్ట్‌ ఫైనల్‌ అయినట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక రెండో జాబితాలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా వున్న నియోజక వర్గాలు ఉన్నట్టు సమాచారం. దాదాపు 30 నియోజకవర్గాల్లో టిక్కెట్ దక్కించుకునేందుకు ఐదారుగురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ఇక్కడ జాబితా వడపోతపై ఆచితూచి అధినేత నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మూడో జాబితాలో పనితీరు బాగాలేని, ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్న సిట్టింగుల స్థానాలు ఉండే అవకాశం ఉంది. అక్కడ సిట్టింగ్‌లకు కాకుండా కొత్త వారిని బరిలో దించే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

తెలంగాణ వచ్చాక మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి బీఆర్‌ఎస్‌ టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఇక సీనియర్లకు తోడు వారి వారసులు పోటీకి సిద్ధం అవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేల కుమారులు, కుమార్తెలు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సిట్టింగులకు దీటుగా నియోజకవర్గాల్లో నేతల వారసులు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈసారి తమకే టిక్కెట్ అని ప్రకటించుకున్నారు. దీంతో అభ్యర్ధుల జాబితాను ఫైనల్ చేయడం అధినేతకు కత్తి మీద సాములా మారింది.

ఇప్పటికే 18మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించాలని వివిధ సభల్లో బీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రజలకు పిలుపునిచ్చింది. వీరితో సహా 60 మందితో కూడిన జాబితాను త్వరలో కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉందని తెలస్తోంది. మిగతా జాబితాల కసరత్తు కూడా తుదిదశకు చేరుకోవడంతో అటు సిట్టింగుల్లో, ఆశావహుల్లో టెన్షన్‌ నెలకొంది. గతంలోనూ అభ్యర్థుల జాబితాను అన్ని పార్టీల కంటే ముందే ప్రకటించి కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారు. ఈ సారి కూడా అదే ప్లాన్‌తో ముందుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. విపక్షాలకు ఎక్కువ సమయం ఇవ్వరాదని చూస్తున్నారు. అందులో భాగంగానే 119 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారుపై కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో నిత్యం కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story