Telangana cabinet : రేపు ప్రగతి భవన్‌లో కేబినెట్‌ కీలక భేటీ...!

కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గ సమావేశమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుంది.

Telangana cabinet : రేపు ప్రగతి భవన్‌లో కేబినెట్‌ కీలక భేటీ...!
X

కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గ సమావేశమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తోంది.. మరో నాలుగు గ్రామాల్లోనూ దళితబంధును పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

గత కేబినెట్ సమావేశం జరిగినప్పుడు రెండ్రోజుల పాటు ఉద్యోగుల భర్తీపై సుదీర్ఘ చర్చ జరిగింది. కానీ నియామకాల ప్రక్రియ కొలిక్కిరాలేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఈ కేబినెట్‌ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఏయే శాఖల్లో, ఎన్ని పోస్టుల భర్తీ, వాటికి సం బంధించిన నోటిఫికేషన్ల జారీ, ఇతర అంశాలపై నిర్ణయాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.. అలాగే ఉద్యోగాల భర్తీతోపాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని సీఎం కేసీఆర్‌ గత ఏడాది డిసెంబర్‌ 13న ప్రకటించారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించాలని, తద్వారా ఏర్పడే కొత్త ఖాళీలను సైతం గుర్తించి భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే.. ఉద్యోగుల పదోన్నతులు, స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్లుగా పోస్టుల విభజన, ఖాళీల గుర్తింపు ప్రక్రియలు సుదీర్ఘంగా సాగాయి. ఆర్థిక శాఖ ఇటీవలే ఈ అంశాలను కొలిక్కి తెచ్చింది. 65వేలకుపైగా ఖాళీ పోస్టులను గుర్తించింది. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. 50 వేల నుంచి 65వేల పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ అవసరాలు, వనరుల సమీకరణ, దళితబంధు పథకానికి చట్టబద్ధత తదితర అంశాలపైనా కేబినెట్‌ చర్చించనున్నట్టు తెలుస్తోంది. వనరుల సమీకరణలో భాగంగా మైనింగ్‌ రంగంలో సంస్కరణల అమలు, భూముల వేలానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతల పథకాలను నిర్మించాలనే ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వాటిపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతలను 3,916 కోట్లతో, బసవేశ్వర లిఫ్టును 2,750 కోట్లతో చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించారు. అయితే వ్యయాన్ని తగ్గించడం కోసం సీసీ లైనింగ్‌ పనులను తొలగించి మొత్తం 4,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, నాబార్డ్‌ నుంచి 2వేల కోట్ల సాయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక బాయిల్డ్‌ రైస్‌ కొనుగోళ్లపై కేంద్రం విముఖత నేపథ్యంలో వచ్చే యాసంగిలో వరి సాగుపై ప్రతిష్టంభన నెలకొంది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులను సన్నద్ధం చేయడం, వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు తదితర అంశాలపై కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక తెలంగాణకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై కేంద్రం మొండి చేయి చూపడం.. కేంద్రం తీరుపై ఎలాంటి విధానం తో ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు. ఇక గణేశ్ నిమజ్జనానికి హైకోర్టు అడ్డంకులు.. రాబోయే కాలంలో శాశ్వత పరిష్కారంపై కేబినేట్‌లో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Next Story

RELATED STORIES