KCR: ఇది నాపై దాడిగానే భావిస్తున్నా: కేసీఆర్‌

KCR: ఇది నాపై దాడిగానే భావిస్తున్నా: కేసీఆర్‌
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని ఖండించిన మంత్రులు.... సమగ్ర విచారణ జరపారన్న కాంగ్రెస్‌, బీజేపీ

కొత్తప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖండించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్‌ వారికి ఓటుతో గట్టి బుద్ధిచెప్పాలన్నారు. ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేయడంతో కడుపులో మూడించుల లోతు దిగిందని కేసీఆర్‌ చెప్పారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కాదు తనపైనే దాడిగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. మనకు కత్తి దొరకదా.. మనం పొడవమా అని ప్రశ్నించారు. తమ పాలనలో కర్ఫ్యూ లేదు.. కరవూ లేదన్నారు. ఎన్నో పోరాటాలు చేశామని, చివరకు కేసీఆర్‌ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో తేలిపోవాలంటూ బయలుదేరి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. వచ్చిన తెలంగాణను పచ్చగా చేసుకోవడానికి మేధావులు, ఆర్థికవేత్తలతో సమాలోచనలు చేసి మెదడు కరిగించి ముందడుగు వేశామని కేసీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణలో వచ్చిన మార్పును మీరు చూస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నాయని ముఖ్యమంత్రి KCR సహా మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులతో ఎవరూ గెలవలేమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. హింసను ఎప్పుడూ నమ్ముకోవద్దని చెప్పారు. దాడికి పాల్పడింది బీజేపీ నేతలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఎదురుదాడికి దిగారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామన్న మంత్రి KTR.. నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ భౌతికదాడులకు దిగుతోందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతల్ని భౌతికంగా అంతంచేసేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో హింస, దాడులకు తావు లేదన్న KTR, ఘటనపై EC కఠినచర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. చికిత్స కోసం ప్రభాకర్‌రెడ్డిని తీసుకొచ్చిన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లిన భారాస రాజ్యసభ సభ్యుడు కేశవరావు.. మంత్రి హరీశ్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి... ఆస్పత్రికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులతో ఎవరినీ గెలవలేమన్న ఆయన కాంగ్రెస్ హింసను ఎప్పుడూ నమ్ముకోదన్నారు. కాంగ్రెస్ అహింస మూల సిద్ధాంతంగానే.. పని చేస్తుందని స్పష్టంచేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసిన వ్యక్తి ఎవరైనా.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిని బీజేపీ MLA రఘునందర్‌రావు ఖండించారు. దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లు కాదని స్పష్టం చేశారు. ఘటన జరగ్గానే కారణం రఘునందన్‌రావు అని బీజేపీ హింసను ప్రేరేపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి విచారకరమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆమె దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని DGPని ఆదేశించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని. గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story