REVANTH: బీఆర్ఎస్‌ను మోదీకి తాకట్టు పెట్టిన కేసీఆర్

REVANTH: బీఆర్ఎస్‌ను మోదీకి తాకట్టు పెట్టిన కేసీఆర్
కేసీఆర్‌ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టుపెట్టాన్న రేవంత్

కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టుపెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెప్తున్నారని అన్నారు. కొన్నినియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారమే చేయట్లేదని.. నారాయణపేట కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ముదిరాజ్ లను బీసీ- డీ నుంచి బీసీ- ఏ గ్రూప్ లోకి మార్చేందుకు... సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడుతామనిచెప్పారు. 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తామని హామీ ఇచ్చారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందేనన్న ఆయన.. భవిష్యత్ లో మాదిగలకు మరిన్ని పదవులు ఇస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ బీఆర్ఎస్‌తో కుమ్మకై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు కూడా తమ ఎంపీ అభ్యర్థులను ఓడించడానికి ఈ రెండు పార్టీల నేతలు కుమ్మక్కు అయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటు వేయమని అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ నరేంద్ర మోదీకి లొంగిపోయారని ఆరోపించారు.

పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇస్తామని మాటిచ్చారు. త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేయబోతున్నామని చెప్పారు. మహబూబ్‌నగర్ ఎంపీగా వంశీ చంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆ మేరకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. కవితను జైలు నుంచి విడుదల చేయించేందుకు కేసీఆర్ ఇలా కుట్ర పన్నాడన్నారు. పక్కనే కృష్ణా నది ఉన్న మనకు చుక్క నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నివర్గాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందన్నారు. పాలమూరు - రంగారెడ్డి జాతీయ హోదా కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం, ఈ ప్రాంత రైల్వే లైన్ కోసం డీకే అరుణ ఏనాడైనా కేంద్రంతో మాట్లాడరా అని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే.. ఇప్పుడు మోదీ హయాంలో రూ.1200 అయిందని విరుచుకుపడ్డారు. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేసి అండగా ఉంటామని భరోసా కల్పించారు. తాను ఈ గడ్డపై పుట్టానని.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని మాటిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story