CM Revanth reddy: ఇది రైతు, మహిళ, యువత నామ సంవత్సరం

CM Revanth reddy: ఇది రైతు, మహిళ, యువత నామ సంవత్సరం
రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరాన్ని రైతు-మహిళ-యువత నామసంవత్సరంగా సంకల్పం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడంతోపాటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని సీఎం వివరించారు. గ్యారంటీలను అర్హులైనవారందరికీ అందించడమే సర్కార్‌ ప్రథమ కర్తవ్యమని స్పష్టంచేశారు.

ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్‌వ్యవస్థీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలగోడు వినేందుకు ప్రజాభవన్‌లోప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పౌరులకు స్వేచ్ఛ కల్పించేందుకు పునరంకితమై పనిచేస్తున్నట్లు స్పష్టంచేశారు. ఎన్నికల్లో ప్రధానంగా హామీఇచ్చిన ఆరింటిలో ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామన్న సీఎం కొత్తఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అర్హులందరికీ సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అగ్రపథాన ఉండాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని ఉద్ఘాటించారు.

యువతకు ఆధునిక సాంకేతికతను అందించి వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేదిశగా ఆలోచన చేస్తున్నామన్న రేవంత్‌రెడ్డి ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేసేదిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఆర్థిక, విద్యుత్‌ తరహాలోనే త్వరలో సాగునీటి రంగంలో అవినీతిపైనా శ్వేతపత్రంవిడుదల చేసి వాస్తవ పరిస్థితిని జనంముందుంచుతామ న్నారు. దోపిడీకి గురైన ప్రజా సంపదను తిరిగి రాబట్టేదిశగా చర్యలు మొదలుపెట్టామని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్న వారి ఆశలు అతి త్వరలో ఫలిస్తాయని సీఎం భరోసా ఇచ్చారు. ఉద్యమకారులపై మోపిన కేసులను బేషరతుగా ఎత్తివేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌ బేగంపేటలో ఐఏఎస్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు శశాంక్‌ గోయల్‌, CS శాంతికుమారి వారికి స్వాగతం పలికారు. పలువురు ఐఏఎస్‌ అధికారులు కుటుంబసభ్యులతో కలిసి సీఎం దంపతులను కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా IASలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story