Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్

Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్
పంట పెట్టుబడి చెల్లింపులు ప్రారంభించిన రేవంత్ సర్కారు

తెలంగాణలో వ్యవసాయశాఖపై సీఎం రేవంత్ రెడ్డి...... సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మూడు గంటల పాటు జరిగిన సమీక్షలో..వ్యవసాయ శాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై..విస్తృతంగా చర్చించారు. రైతుబంధు అమలుతీరు, లబ్దిదారులు, వ్యయం, సంబంధిత అన్నిఅంశాలను అధికారులు వివరించారు. సాగు చేయనప్పటికీ ప్రతి భూమికి పెట్టుబడి సాయం ఎందుకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాగులో లేని, స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న భూములకు డబ్బులు ఇవ్వడం వల్ల రైతులకు ఏం ప్రయోజనం ఉంటుందని సీఎం అడిగినట్లు సమాచారం.

రైతుబంధుకు సంబంధించి . సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలోనే రైతుబంధుకు సంబంధించిన.. అన్ని అంశాలపై చర్చిస్తామని చెప్పినట్లు తెలిసింది. తాము హామీ ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కానందున ఎన్నికల సమయంలో నిలిచిపోయిన రైతుబంధు చెల్లింపులు చేయాలని. అధికారులను రేవంత్ ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా తక్షణమే పంట పెట్టుబడి సాయం అందించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు రైతుబంధు చెల్లింపులను ప్రారంభించారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీ మేరకు రైతులకు... 2 లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని... ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వివిధ పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి, మార్కెటింగ్, గిట్టుబాటు ధరలపై రేవంత్ ఆరా తీశారు. పసుపు రైతులు, సాగయ్యే విస్తీర్ణం వివరాలు తెలుసుకున్న సీఎం... ఇంత తక్కువ సంఖ్యలో పసుపు రైతులు ఉన్నప్పటికీ సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారని తెలిసింది. ఏఈవోల పనితీరు, రైతువేదికలపైనా ఆయన ఆరా తీశారు. అంత ఖర్చుతో నిర్మించిన రైతువేదికలు ఎందుకు వినియోగంలోలేవని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర, ప్రభుత్వపరంగా అందించాల్సిన ప్రోత్సాహకాల గురించి తెలుసుకున్నారు. మార్కెటింగ్ సంబంధించిన అంశాలపై అధికారులు ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం.

అలాగే ప్రస్తుతం ‘జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్’లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ను ఇకనుండి ‘ప్రజావాణి’గా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ‘ప్రజావాణి’ని ఇకనుండి ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రజావాణికి ఉదయం 10 గంటల లోపు జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story