తెలంగాణ కాంగ్రెస్‌‌కు మరో సవాల్‌!

తెలంగాణ కాంగ్రెస్‌‌కు మరో సవాల్‌!
కాంగ్రెస్ లో సాగర్ ఉప ఎన్నిక కన్ఫ్యూజన్.. అభ్యర్థి ఎవరన్నది ఇంకా రాని స్పష్టత..

తెలంగాణ కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఉపఎన్నిక రూపంలో మరో సవాల్‌ ఎదురు కాబోతోంది. సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య అనే చెప్పాలి. ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ కు అనివార్యం. రాష్ట్రంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ జయకేతనం కొనసాగుతోంది. కారు స్పీడ్ కు బ్రేక్ లు వేయాల్సిన కాంగ్రెస్ ప్లేస్ ను బీజేపీ ఆక్రమించింది. దుబ్బాక ఉపఎన్నికలో కారుకు, హస్తానికి షాక్ ఇచ్చింది బీజేపీ. రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం.. దుబ్బాక లో గెలవడం కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోంది. అందుకే నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో గెలిచి ఉనికి చాటుకోవాలని చూస్తున్నారు హస్తం నేతలు.

సాగర్ లో తమ గెలుపుకు పూర్తి స్థాయిలో అవకాశం ఉందని హస్తం నేతలు ధీమాగా ఉన్నారు. ప్రాథమికంగా పార్టీ నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ గెలుపుకు ఛాన్స్ ఉందని రావడంతో హస్తం నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. అయితే జానారెడ్డి అభ్యర్థి గా సాగిన ఆ సర్వేలో కాంగ్రెస్ వైపు మెజారిటీ ఓటర్లు జై కొట్టారని తెలుస్తోంది. దీంతో జానారెడ్డి నే అభ్యర్థి అని అందరు సీనియర్లు చెబుతున్నారు. కానీ పోటీ విషయంలో జానారెడ్డి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇటీవల జానారెడ్డి తన కొడుకు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వం పై చేసిన కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

అయితే సాగర్ అభ్యర్థిత్వంపై జానారెడ్డి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కారణం ఆయన కుమారుడే అని తెలుస్తోంది. ఈసారి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి తండ్రి పై ఒత్తిడి చేస్తున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది. కొడుకు ఒత్తిడితో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు జానారెడ్డి. అందుకే పోటీపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది. పార్టీ నాయకులంతా మూకుమ్మడిగా మీరే నిలబడాలి అని జానాపై ఒత్తిడి తెస్తున్న.. ఆయన మాత్రం ఎక్కడా తన మనసులోని మాటను బయట పెట్టడం లేదు. ఎఐసిసి రాష్ట్ర ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ జానా అభ్యర్థిత్వంపై స్పష్టత ఇచ్చినా.. జానారెడ్డి మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

ప్రస్తుతానికి నియోజకవర్గంలో తండ్రి,కొడుకులు ఇద్దరూ కలిసి తిరుగుతున్నప్పటికీ.. పోటీ చేసే అభ్యర్థి జానారెడ్డినా లేక ఆయన కొడుకా అనే కన్ఫ్యూజన్ మాత్రం క్యాడర్ ను వీడటం లేదు. లీడర్ల లో ఈ కన్ఫ్యూజన్ కు పుల్ స్టాప్ పడాలంటే అధిష్టానం సాగర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాల్సిందే అంటున్నారు పార్టీ సీనియర్లు. మరి హైకమాండ్ దీనిపై ఎప్పటికీ స్పష్టత ఇస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story