Telangana Assembly Elections: ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం

Telangana Assembly Elections: ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం
రెండు రోజులు స్కూల్ లకు సెలవు, 144 సెక్షన్

శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఇప్పటికే ఈవీఎంలు సహా సిబ్బందిని సిద్ధం చేశారు. సిబ్బంది ఇవాళ పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ప్రలోభాల కట్టడిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎన్నికల సంఘం... అందుకు సంబంధించి విస్తృత చర్యలు చేపట్టింది. శాంతిభద్రతలు... ప్రత్యేకించి సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు.

రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ కంటే 90 నిమిషాలు ముందు అంటే ఉదయం 5 గంటలా 30 నిమిషాలకు మాక్ పోలింగ్ చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.


ఓటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి రవాణా సదుపాయంతోపాటు 21 వేల 686 వీల్ ఛైర్స్ సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి కూడా ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. లకషా 85 వేల మంది పోలింగ్ సిబ్బంది... 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్, ఇతరులు మొత్తం కలిపి రెండు లక్షలకుపైగా పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను 3803 సెక్టార్లుగా విభజించారు. సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలో పోలింగ్ కు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షిస్తారు.

శాసనసభ ఎన్నికల పోలింగ్‌ దృష్టా రేపు ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై కార్మిక శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story