TS POLLS: పాదయాత్రలు, ర్యాలీలు.. సభలు..

TS POLLS: పాదయాత్రలు, ర్యాలీలు.. సభలు..
ప్రచార గడువు సమీపిస్తుండడంతో హోరెత్తుతున్న ప్రచారం.. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల కృషి

తెలంగాణలో ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థుల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ర్యాలీలు, పాదయాత్రలు , ఇంటింటి ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లడుగుతున్నారు. పరకాల నియోజకవర్గంలో గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్ హైవే భూ నిర్వాసిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న రైతు అభ్యర్థులు పరకాల మండలంలోని వెల్లంపల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో ప్రచారాన్ని కొనసాగించారు. రైతులను గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాయపర్తిలోని పలు గ్రామల్లో పర్యటించారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్ నాయక్ గెలుపు కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్కకు ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికారు.


జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన జీవన్‌రెడ్డిఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ వాకర్స్‌ని కలిసి ప్రచారం నిర్వహించారు. మంథని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరిస్తూ అభ్యర్థి శ్రీధర్ బాబు ఓట్లు అభ్యర్థించారు. మంథని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధుకర్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి సతీమణి రజిత రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో... మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేపట్టారు. నల్గొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.


దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌ రావుకు మద్దతుగా ఎంపీ అరవింద్‌ రోడ్‌ షో నిర్వహించారు. మెదక్ జిల్లా హవేలీ గణపూర్ మండలంలో భారాస అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. గజ్వేల్‌లో ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ప్రజలు బోనాలతో స్వాగతం పలికారు. ఖమ్మం నియోజకవర్గంలో భారాస అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. గడపకుగడపకు సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య తరఫున..ఛత్తీస్‌గఢ్‌ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా ప్రచారం నిర్వహించారు. వనపర్తి నియోజకవర్గంలో ప్రచారం చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ప్రజలు బతుకమ్మ, ఆటపాటలతో స్వాగతం పలికారు.


హైదరాబాద్‌ నగర పరిధిలోనూ ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు ప్రచారాల్లో జోరు పెంచారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ...అందర్నీ పలకరిస్తూ ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో రోడ్‌షోలు నిర్వహిస్తుంటే... నియోజకవర్గ అభ్యర్థులు మేనిఫెస్టో వివరిస్తూ...తమకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story