TPCC: ఇంకా కొలిక్కి రాని చర్చలు

TPCC: ఇంకా కొలిక్కి రాని చర్చలు
కాంగ్రెస్‌ రెండో జాబితాపై నేడు చర్చలు... 35 స్థానాలపై ఏకాభిప్రాయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండో జాబితాపై కాంగ్రెస్ చేపట్టిన కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే 55మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన అభ్యర్థుల ఎంపికపై దిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ నేతృత్వంలో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. మొదటి జాబితా 55 మినహా 64 నియోజకవర్గాలలో 35 స్థానాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మరో 29 స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరక కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ లోతైన కసరత్తు చేస్తోంది. ఇవాళ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ ఇంకా 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా అందులో నాలుగింటిని వామపక్షాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్.... సీపీఎంకు మిర్యాలగూడ సీటును ఇవ్వడానికి అంగీకరించింది. రెండో స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది.


ఒకే పేరుతో పాటు రెండు పేర్లు ఉన్న స్థానాలను కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుధవారం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 64 స్థానాలకు దాదాపు 5 గంటల పాటు కసరత్తు కొనసాగింది. ఇందులో 35స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన 29 నియోజకవర్గాల్లో పోటీదారుల ఎంపికలో కేంద్ర ఎన్నికల కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం వల్ల పార్టీలో ఉన్న నాయకులకు అన్యాయం జరుగుతోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట్ల మాత్రమే బయటి నేతలకు టికెట్లు ఇస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

29 నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిస్తున్న వారు సమఉజ్జీలు కావడంతో కేంద్ర ఎన్నికల కమిటీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా గట్టి పోటీ ఉన్న స్థానాల్లో సూర్యాపేట, ఎల్బీనగర్, మునుగోడు, ఇబ్రహీంపట్నం, భువనగిరి, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నిజామాబాద్ అర్బన్ తదితర నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. ఈ స్థానాలకు అభ్యర్థుల ఖరారుకు CEC కూడా లోతైన కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత K.C.వేణుగోపాల్ నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మరోసారి సమావేశమయ్యారు. నిజామాబాద్ అర్బన్ టికెట్ కోరుతున్న PCC వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.ఇవాళ సాయంత్రానికి అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story