Telangana BJP Manifesto : ఏడు ప్రధాన అంశాలతో బీజేపీ ఇంద్రధనస్సు మేనిఫెస్టో

Telangana BJP Manifesto : ఏడు ప్రధాన అంశాలతో బీజేపీ ఇంద్రధనస్సు మేనిఫెస్టో
విడుదల చేయనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా

భాజపా ఎన్నికల ప్రణాళికను సిద్ధమైంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా రూపొందించిన మేనిఫెస్టోకు... "ఇంద్రధనుస్సు"గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. భారాస మేనిఫెస్టో, కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు దీటుగా ఏడు ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హామీల అమలుకు ప్రధాని మోదీనే గ్యారంటీగా చెబుతున్న భాజపా మేనిఫెస్టోను రేపు హోంమంత్రి అమిత్‌షా విడుదల చేయనున్నారు.

భాజపా మేనిఫెస్టోలో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, రైతులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. KCR సర్కార్ ఉపాధి కల్పనలో విఫలమైందని చెబుతూనే... వారికి ఉండేలా మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. పేదలకు లబ్ధి కలిగించే సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అదనంగా కొత్త అంశాలను చేర్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి వ్యక్తికీ బీమా పథకంతో అందరికీ లబ్ధి చేకూరుతుందని కమలదళం భావిస్తోంది. వీటికి తోడు స్థానిక సెంటిమెంట్‌ను వాడుకునేలా నగరాల పేర్ల మార్పు అంశాన్ని సైతం మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


వరికి కనీస మద్దతు ధర 3,100కు పెంచడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలని భాజపా యోచిస్తోంది. దీనికి తోడు ఆయుష్మాన్‌ భారత్‌ కింద ప్రస్తుతం ఉన్న 5 లక్షల పరిమితిని పది లక్షలకు పెంచాలని భావిస్తోంది. పెళ్లైన ప్రతి మహిళకు ఏటా 12 వేలతో పాటు 500ల రూపాయలకే గ్యాస్ సిలిండర్‌ ఇచ్చేలా హామీ ఇవ్వనుంది. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్లు, జన ఔషధి కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 20వేలు సహాయం వంటివి ప్రకటించనున్నారు. UPSC తరహాలో TSPSC జాబ్‌ క్యాలెండర్‌, IIT, AIMS తరహాలో విద్యా సంస్థల ఏర్పాటు, PM ఆవాస్‌ యోజన కింద అర్హులకు ఇళ్ల వంటివి ఎన్నికల ప్రణాళికలో చేర్చినట్లు సమాచారం. చేతివృత్తుల వారికి ఉచిత విద్యుత్‌, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, మహిళా సంఘాలు, రైతులకు వడ్డీ లేని రుణాల వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రేపు ఉదయం భాజపా ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story