TS: రేషన్‌కార్డు ఉంటేనే రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌!

TS: రేషన్‌కార్డు ఉంటేనే రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌!
తెలంగాణ ప్రభుత్వానికి పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు... లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకునే అవకాశం....

మహాలక్ష్మి పథకంలో భాగమైన 500కే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌరసరఫరాల శాఖ తెలంగాణ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఉన్నవారినే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా.. లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలుచేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషన్‌కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి... కలెక్టర్లతో నిర్వహించే కాన్ఫరెన్స్‌లో ఈ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేక పన్నెండు ఇవ్వాలా? అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. కొత్త కార్డులు పొందే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చెబుతున్నారు. కొత్త గ్యాస్‌ కనెక్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం.

మరోవైపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రజాపాలన పేరుతో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమం అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించనుంది. దీనిపై కూలంకషంగా చర్చించేందుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే 'ప్రజా పాలన' కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో మరింత పకడ్బందీగా ప్రజావాణి నిర్వహించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటిస్తారు. ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.

నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేట్లు పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు చేపట్టనున్నారు. అందులో భాగంగా గ్రామసభలను నిర్వహించనున్నారు.దయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు చేపడతారు.

Tags

Read MoreRead Less
Next Story