TS: నీటిపారుదల శాఖ ప్రక్షాణనకు తెలంగాణ సర్కార్‌ చర్యలు

TS:  నీటిపారుదల శాఖ ప్రక్షాణనకు తెలంగాణ సర్కార్‌ చర్యలు
నీటి పారుదల శాఖకు తాజాగా మరో కార్యదర్శి.. ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్‌ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. నీటిపారుదలశాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదలశాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంతోపాటు పునర్వ్యవస్థీకరణ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈఎన్సీల స్థాయిలో ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా శాఖకు మరో కార్యదర్శిని కూడా నియమించింది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్‌ను ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఇంజనీర్ల విధులకు సంబంధించి కూడా మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన శాఖ కావడంతోపాటు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలు చాలా ఉన్న తరుణంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికలకు ముందే మేడిగడ్డ ఆనకట్ట కుంగిన పరిస్థితుల్లో... విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ద్వారా విచారణ చేయించి.. నీటిపారుదల శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.


రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లును విధుల నుంచి తొలగించిన సర్కార్... ఈఎన్సీ జనరల్ మురళీధర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించింది. వారితోపాటు మరికొందరు ఇంజనీర్లపై కూడా తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈఎన్సీ జనరల్‌గా పరిపాలనా విభాగం ఈఎన్సీ అనిల్ కుమార్‌కు... రామగుండం ఈఎన్సీగా జగిత్యాల చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. మరికొంత మంది ఇంజనీర్లపై కూడా చర్యలు ఉంటాయని ప్రభుత్వం అప్పట్లోనే పేర్కొంది.


నీటిపారుదలశాఖపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... సాగునీటి రంగానికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికలను కూడా వివరించారు. ప్రాజెక్టులను పనుల ఆధారంగా వర్గీకరించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే వాటిపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రానున్న ఏడాది కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరిచ్చే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు నదీ యాజమాన్య బోర్డులతో కలసి పనిచేయాల్సిన, పరిష్కరించుకోవాల్సిన పలు అంశాలున్నాయి. ట్రైబ్యునల్, కేంద్రంతో అంశాలు, తదితరాలపై కూడా దృష్టి సారించాల్సి ఉంది. దీంతో శాఖకు మరో కార్యదర్శిని ప్రభుత్వం నియమించింది. నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని మరో ఐఏఎస్ అధికారిని కూడా శాఖకు కేటాయించారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పాటిల్ ప్రశాంత్ జీవన్ ను నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పరంగా రాహుల్ బొజ్జానే.. శాఖ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించనుండగా... అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్‌కు తగిన బాధ్యతలు అప్పగించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story