Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలేది లేదు

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలేది లేదు
ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్

మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇంజినీర్లు, Lఅండ్ T సంస్థ ప్రతినిధులు చర్చించి.... తదుపరి కార్యాచరణపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓ వైపు న్యాయవిచారణకు సిద్ధమవుతున్న సర్కార్... మరోవైపు వీలైనంత త్వరగా కాపర్ డ్యాం నిర్మాణంతో పాటు విచారణ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. ఆనకట్ట డిజైన్లను ఎవరూ తనిఖీ చేయకుండా ఎలా నిర్మిస్తారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చాక అప్పటి ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూడడం Lఅండ్T సంస్థకు తగదన్న ఆయన... నాణ్యత లేకుండా, నాసిరకం పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగిన అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జ్‌తో న్యాయవిచారణ జరిపించి... బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా CM సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఆనకట్టకు సంబంధించి తదుపరి కార్యాచరణ విషయమై కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి CM సూచించారు. మరమ్మతుల భారాన్ని తాము భరించబోమని "Lఅండ్ T” స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. L అండ్ T ప్రతినిధులతో పాటు నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించిన ఉత్తమ్అ న్ని అంశాలపై లోతుగా సమీక్షించారు. “Lఅండ్ T” గ్రూప్ డైరెక్టర్ S.V.దేశాయ్, జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్, Lఅండ్ T మెట్రో MD కేవీబీరెడ్డితో పాటు ENCలు మురళీధర్, వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌పై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు.

నీటిపారుదలశాఖ ఇచ్చిన డిజైన్ ఆధారంగా తాము నిర్మాణం చేశామని ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పారు. ఇంజినీర్లు రూపొందించిన డిజైన్లను ఎవరైనా పరిశీలించారా... అని మంత్రి ENCలను ప్రశ్నించారు. అంత పెద్ద ఆనకట్ట డిజైన్‌ను థర్డ్ పార్టీ తనిఖీ చేయకుండా ఎలా నిర్మిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. ఇసుకపై భారీ నిర్మాణం ఎలా నిలుస్తుందని అనుకున్నారని ప్రశ్నించారు. ఇంజినీర్లకు బాధ్యత లేదా.... అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్‌ను ఏ మాత్రం పరిశీలించకుండా నిర్మాణం ఎలా చేపట్టారని ఎల్ అండ్ టీ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ అడిగారు. బాధ్యతల నుంచి ఎలా తప్పుకుంటారని ప్రశ్నించిన ఆయన... ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఘటన జరిగి రెండు నెలలవుతుందని..... ఇప్పటి వరకు ఏం తేల్చారని మంత్రి ప్రశ్నించారు. ఈ దిశగా అప్పటి ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆయన సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story