Prajavani : ప్రజాభవన్‌లో ప్రజావాణి.. అర కి.మీ మేర బారులుదీరిన అర్జీదారులు

Prajavani : ప్రజాభవన్‌లో ప్రజావాణి.. అర కి.మీ మేర బారులుదీరిన అర్జీదారులు
ఆన్‌లైన్ పోర్టల్‌లోకి ప్రజావాణి ఫిర్యాదులు

ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి భారీస్పందన లభిస్తోంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కి వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందించారు. వృద్ధులు, యువకులు, మహిళలు, వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో... అర్జీదారులకు ఇబ్బంది రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌లోని జ్యోతిరావుపూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణికి సమస్యలపై ఫిర్యాదులు పోటెత్తాయి. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడానికి వచ్చిన ఫిర్యాదుదారులతో ప్రజా భవన్ కిక్కిరిసింది. తెల్లవారు జాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన అర్జిదారులు... తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎంను కోరేందుకు యువత సైతం తరలివచ్చారు. ప్రజలు పేర్కొన్న సమస్యలను పరిశీలించిన అధికారులు... త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు ప్రత్యేక క్యూలైన్లలో ప్రజాభవన్‌లోకి అనుమతించారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు... ఎక్కువగా పెన్షన్‌లు, రెండు పడక గదుల ఇళ్లు, భూసమస్యలపై ఫిర్యాదులు చేశారు. పింఛన్లు, ఇల్లు, ఉద్యోగాలు, రవాణా రంగంలో బిల్లులు తగ్గించాలనే వినతులతో పెద్దఎత్తున జనాలు రావడంతో...ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలను క్రమబద్దీకరించిన పోలీసులు... అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీల్‌ ఛైర్లలో దివ్యాంగులను సిబ్బంది లోనికి తీసుకువెళ్లారు. కుర్చీలు, తాగునీటిని అందుబాటులోఉంచి, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా... ప్రజాభవన్ వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు..వచ్చిన ప్రతి కంప్లైంట్ ని అధికారులు దగ్గరుండి నోట్ చేసుకుంటున్నారు. ఫిర్యాదులను నమోదు చేయడానికి సత్వర పరిష్కారాన్ని చూపడానికి ఒక మెకానిజంని సిద్ధం చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చే ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్ ని మెన్షన్ చేస్తూ వచ్చిన ప్రతి కంప్లైంట్ ని మొదటగా ఆన్లైన్ పోర్టల్ అప్లోడ్ చేస్తున్నారు. శాఖలు, జిల్లాలు వారీగా సంబంధిత అధికారులు కుదిరిన వారికి సత్వర పరిష్కారం, జటిలమైన వాటి సాధ్యాసాధ్యాలను నివేదిక వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు.హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ప్రజావాణి కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు వాటి పర్యవేక్షణ దగ్గరుండి చూసుకుంటున్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని శాఖలు ఈ ప్రజావాణి కార్యక్రమం కోసం పనిచేస్తున్నాయి. కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టుగా ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్లకి మెసేజ్ వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆ మొబైల్ నెంబర్ ఆధారంగా కంప్లైంట్ ఇచ్చిన వారిని సంబంధిత అధికారులు సంప్రదించి సత్వర పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story