REVANTH: తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తాం

REVANTH: తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తాం
ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఆవరణలో ఆరు గ్యారెంటీల్లోని రెండు పథకాలైన మహలక్ష్మి, చేయూత పథకాల్ని సీఎం ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచే కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులతో కలిసి సీఎం అందుబాటులోకి తెచ్చారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను ప్రారంభిస్తున్నాన్న రేవంత్‌రెడ్డి... మహిళలు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు.


శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని... రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10లక్షలకు పెంచే చేయూత పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇటీవల ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం, శాసనసభ ఆవరణలోనే రెండు గ్యారంటీల అమలు ప్రారంభోత్సవం నిర్వహించారు. ముందుగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ లోగోను మంత్రులు, అధికారులతో కలిసి ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ సాయాన్ని 5లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ చేయూత పథకాల్ని అమల్లోకి తెచ్చారు

అనంతరం... మహాలక్ష్మి పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు తీసుకువచ్చిన ఈ పథకాన్ని... మంత్రులు, అధికారులతో పాటు ప్రముఖ క్రీడాకారణి నిఖత్‌ జరీన్‌తో కలిసి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు సంబంధించిన లోగో, గోడ పత్రికలను, జీరో ఛార్జ్‌ టికెట్‌ను సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండగరోజని...రెండు గ్యారంటీలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని సీఎం పిలుపునిచ్చారు.


అనంతరం ఆర్టీసీ బస్సులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్ రావు ఠాక్రే, మంత్రులతో కలిసి ట్యాంక్‌బండ్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వచ్చారు. బాబాసాహెబ్‌కు నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీకి వెళ్లారు. అంతకుముందు పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి 2కోట్ల రూపాయల చెక్కు అందించారు. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణం, సందడి నడుమ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌ల్లో మహాలక్ష్మి పథకాన్ని మహిళలతో కలిసి అధికారులు ప్రారంభించారు. అతివలకు ప్రభుత్వం నుంచి వచ్చిన మహాలక్ష్మి ఉచిత టికెట్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రయాణికులకు ఉచిత ప్రయాణం పై అవగాహన కల్పించారు. ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి ప్రారంభం కావడంతో ఆర్టీసీ ప్రాంగాణాల్లో పెద్ద ఎత్తున మహిళలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తరలివచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story