ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ హస్తం నేతల్లో కుదరని ఏకాభిప్రాయం

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ హస్తం నేతల్లో కుదరని ఏకాభిప్రాయం
కోదండరామ్ కు మద్దతు విషయంలో కూడా రాష్ట్ర నేతలతో పాటు హస్తిన పెద్దల్లో ఇంకా ఒక క్లారిటీ కనిపించడం లేదు.

తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ రాజుకుంది. అభ్యర్థుల ఎంపికపై హస్తం నేతల్లో ఏకాభిప్రాయం రావడం లేదు. రాష్ట్ర నేతలు, హస్తిన దూతలు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు పడినా .. ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. పోటీ చేసేందుకు ఆశావాహులు అధికంగా ఉండ‌టంతో ఎంపిక ప్ర‌క్రియ ఓ కొలిక్కి రాక‌.. చిక్కుముడి వీడ‌టం లేదు. అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్రానికి వచ్చిన మాణిక్యం ఠాగూర్.. సమీక్షలు నిర్వహించి ఎటూ తేల్చకుండా జీవన్ రెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.

ఠాగూర్ ఆదేశాలతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల బలాబలాలపై దృష్టి పెట్టింది జీవన్ రెడ్డి కమిటీ. అన్ని వైపుల నుంచి నేతల అభిప్రాయాలు తీసుకున్న కమిటీ సభ్యులు .. ఫైనల్ లిస్ట్ ను హస్తినకు పంపారు. అయితే ఢిల్లీ నుంచి మాత్రం అంత స్పీడ్ గా స్పందన రావడం లేదు. కమిటీ రిపోర్ట్ చూశాక ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయకుండా ఇంకా నాన్చుడు ధోరణి అవలంబించడంపై రాష్ట్ర నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిందన్న వాదనతో ఏకీభవించడం లేదు జీవన్ రెడ్డి. రాబోయే ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.

మరోవైపు కోదండరామ్ కు మద్దతు విషయంలో కూడా రాష్ట్ర నేతలతో పాటు హస్తిన పెద్దల్లో ఇంకా ఒక క్లారిటీ కనిపించడం లేదు. ఠాగూర్ సమీక్షలో కూడా మెజార్టీ నేతలు కోదండరామ్ కు మద్దతు విషయంలో తీవ్రంగా వ్యతిరేకించారు. జీవన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెబుతూ.. తుది నిర్ణయం అధిష్టానానిదే అంటున్నారు. అలాగే ఎమ్మెల్సీ టికెట్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు.. అధిష్టానం ఎవరికి అవకాశం వచ్చినా అందరూ కలిసి పని చేస్తారని ఏ ఒక్కరూ ఇండిపెండెంట్ గా పోటీ చేయరని జీవన్ రెడ్డి చెబుతున్నారు.

అన్ని పార్టీల అభ్యర్థులు ఫీల్డ్ లో దూసుకు పోతుంటే.. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు మాత్రం ఇంకా డోలాయమానంలో ఉన్నారు. అధిష్టానం అభ్యర్థుల ప్రకటన చేయడంతో పాటు పోటీ పడుతున్న అందరు అభ్యర్థులను ఎలా సమన్వయం చేస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story