తెలంగాణలో MLC ఎన్నికల గురించి ఈ విషయాలు తెలుసా !

తెలంగాణలో MLC ఎన్నికల గురించి ఈ విషయాలు తెలుసా !
సాధారణ ఎన్నికల పోలింగ్‌కు పూర్తి భిన్నంగా MLC ఓటింగ్‌ ఉంటుంది.

తెలంగాణలో పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారానికి తెరపడింది. హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 93 మంది మంది బరిలో ఉన్నారు. అలాగే వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల స్థానానికి 71 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు ధీటుగా పోటీ ఇవ్వడంతో మరింత రసవత్తరంగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపు అవ్వడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

ఈ నెల 14 ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 17న కౌంటింగ్‌ జరనగుంది. పోలింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం నుంచి పోలింగ్‌ సామాగ్రిని ఆయా నియోజకవర్గాలకు పంపిణీ చేశారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌. రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.

ఇక.. ఓటింగ్‌ విధానానికొస్తే.. సాధారణ ఎన్నికల పోలింగ్‌కు పూర్తి భిన్నంగా MLC ఓటింగ్‌ ఉంటుంది. సాధారణ ఎన్నికల బరిలో నిలిచినవారిలో ఒక్కరికి మాత్రమే ఓటేస్తాం. కానీ... పట్టభద్రుల MLC ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎంతమందికైనా ఓటువేయోచ్చు.ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యతా నంబరే గెలుపోటములను నిర్ణయిస్తుంది. రెండు పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో.. అభ్యర్థులందరి పేర్లతోపాటు, నోటా కూడా కలిపి ఎన్నికల్లో జంబో బ్యాలెట్‌ను వినియోగిస్తారు. న్యూస్‌ పేపర్‌ పరిమాణంలో ఈ బ్యాలెట్‌ పేపర్‌ ఉండనుంది. ప్రాధాన్యతాక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపునకే కనీసం రెండురోజులు పడుతుందంటే ఉత్కంఠ ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థులందరి పేర్లు తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటాయి. పేరుకు ఎదురుగా ఉండే బాక్సులో అభ్యర్థికి ఇచ్చే ప్రాధాన్యతా సంఖ్యను వేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యత సంఖ్యను అంకెల్లో మాత్రమే రాయాలి. పోలింగ్‌ కేంద్రంలో అధికారి ఇచ్చే ఊదా రంగు కలర్‌ స్కెచ్‌ పెన్‌తో మాత్రమే అంకెలు వేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటును కచ్చితంగా వేయాలి. తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య వరకు ప్రాధాన్యతా క్రమంలో సూచించవచ్చు. ప్రాధాన్యతను సూచించే క్రమంలో మధ్యలో ఒక అంకెను వేయకపోతే.. తర్వాత సూచించే ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకోరు. ఒక అభ్యర్థికి ఒక్క ప్రాధాన్యత ఓటును మాత్రమే ఇవ్వాలి. ఒకరి కంటే ఎక్కువమందికి 1 అని ఇస్తే ఆ ఓటు చెల్లదు. అలాగే బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బాక్సులో ఇతర రాతలు, సంతకాలు, వేలుముద్ర కానీ వేస్తే చెల్లదు.

కౌంటింగ్‌ విషయానికొస్తే.. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ... MLC ఎన్నికల కౌంటింగ్‌ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మొత్తం చెల్లుబాటైన ఓట్లలో యాభైశాతం కంటే ఎక్కువ వస్తేనే విజేతను ప్రకటిస్తారు. అంటే ఒక అభ్యర్థికి 50 శాతానికి పైగా వచ్చేదాకా ప్రాధాన్య ఓట్ల కౌంటింగ్‌ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ ప్రాధాన్యత ఓటు లెక్కింపుతోనే గెలిచినవారు లేరు. అదేవిధంగా 2వ ప్రాధాన్యత ఓటు దాటి లెక్కించలేదు.

కౌంటింగ్‌ కేంద్రానికి చేరిన బాక్సుల్లోని బ్యాలెట్‌ పేపర్లన్నింటినీ ఓట్ల లెక్కింపు రోజున ఒక్కచోట కుమ్మరిస్తారు. బ్యాలెట్‌ పేపర్లను ఓపెన్‌ చేయకుండా 50 చొప్పున కట్టలు కడతారు. ఇలా కట్టిన బండిళ్లను ఒక డ్రమ్ముల్లో వేసి కలుపుతారు. తర్వాత వాటిని టేబుళ్ల వారీగా పంపిణీ చేస్తారు. ఒక్కో టేబుల్‌ వద్ద ఒక్కో అభ్యర్థికి ఒక్కోగడిని కేటాయిస్తారు. కౌంటింగ్‌ అసిస్టెంట్లు బ్యాలెట్‌ పేపర్లను తెరిచి ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను మాత్రమే పరిశీలిస్తారు. 1 నంబర్‌ ఎవరి పేరు ముందు వేస్తే ఆ బ్యాలెట్‌ పేపర్‌ను సంబంధిత అభ్యర్థికి కేటాయించిన గడిలో వేస్తారు. ఈ క్రమంలోనే చెల్లని, అనుమానాస్పద ఓట్లను కూడా గుర్తిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story