Telangana : ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

భారీ మెజారిటీ కోసం ప్రయత్నాలు

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సాగుతుండడంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే... తాము గెలిస్తే పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో చేపట్టే అభివృద్ధిని పనుల గురించి వివరిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు.. సభలు, సన్నాహక సమావేశాలతో.... తమ అభ్యర్థలను భారీ మెజారీటీతో గెలిపించుకోవాలని... శ్రేణులకు పిలుపునిస్తున్నారు.

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల సందడితోపాటు ప్రచార వేడి మరింత పెరిగింది. గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి చేసిన మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధు.. భారీ మెజారిటీతో గెలుస్తారని... మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం.... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పట్టణంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం... ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

భువనగిరి భారాస ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ తరఫున మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి.. సూర్యాపేట జిల్లాలో ప్రచారం నిర్వహించారు. మాజీ MLAగాదరికిశోర్‌తో పాటు పలువురు నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రోడ్ షో పాల్గొన్నారు. ఖమ్మంలో భారాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాల్గొ‌న్నారు. నిజామాబాద్‌ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో.. మాజీమంత్రులు గంగుల, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌అలీ పాల్గొన్నారు. హనుమకొండలో నిర్వహించిన భారాస కార్యకర్తల సమావేశంలో... మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌లో భారాస ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌... కాంగ్రెస్‌, భాజపాలపై విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్ లోక్‌సభ భాజపా అభ్యర్థి మాధవీలత... మలక్‌పేట్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఖమ్మంలో భాజపా ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీ, రోడ్‌షోలో... రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు.హైదరాబాద్ MIM ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఓవైసీ.. పాతబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ తనను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Tags

Read MoreRead Less
Next Story