ఐటీఐఆర్ ప్రాజెక్టు పై కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లేఖ!

ఐటీఐఆర్ ప్రాజెక్టు పై కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లేఖ!
ఐటిఐఆర్ మొదటిదశలో భాగంగా గుర్తించిన అంశాలపై నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వస్తోందన్నారు.

ఐటిఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్‌. 2014 నుంచి ఐటీఐఆర్ పై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదని, కనీసం ఇప్పటికైనా దాన్ని పునరుద్ధరించాలని కోరారు కేటీఆర్‌. 2008లో కేంద్రం ఐటీఐఆర్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుందని, 2010లో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారని గుర్తు చేశారు.

ఇందుకోసం 49వేల ఎకరాల తో పాటు ౩ క్లస్టర్ లను హైదరాబాద్లో గుర్తించామన్నారు. కొత్త ఐటీ కంపెనీలను రప్పించేందుకు, పెట్టుబడులకు ప్రోత్సాహకంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. 3 వేల 275 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రెండు దశల్లో ఈ నిధులను ఖర్చు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందన్నారు.

ఐటిఐఆర్ మొదటిదశలో భాగంగా గుర్తించిన అంశాలపై నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వస్తోందన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌. కేంద్రానికి అనేకసార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. అయినా ఆరేళ్లలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్‌.అయినా కూడా ఐటి రంగంలో తెలంగాణ గొప్ప వృద్ధిని సాధించిందని తెలిపారు. 2014 లో ఉన్న 57వేల 258 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులను 2019- 20 నాటికి లక్షా 28వేవ 807 కోట్లకు పెరిగేలా చేశామన్నారు. ఆరేళ్లలో 110 శాతం వృద్ధిని సాధించిందని, ఇది జాతీయ సగటు కన్నా ఎంతో ఎక్కువ అని లేఖలో తెలిపారు.

ఇక అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తమ గమ్య స్థానంగా ఎంచుకున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా అనలిటిక్స్ వంటి సాంకేతిక రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ పెద్దా ఇబ్బందులు పడలేదన్నారు. హైదరాబాద్‌కు ఐటిఐఆర్ పథకాన్ని అందిస్తే.. ఐటీ పరిశ్రమవృద్ధికి ఊతం ఇస్తుందన్నారు. కేంద్రం చెబుతున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల స్ఫూర్తితో ఐటీఐఆర్ ప్రారంభిస్తే బాగుంటుందన్నారు. దీని వల్ల తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story