TS Ministers: బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ మంత్రులు

TS Ministers: బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ మంత్రులు
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి

సచివాలయంలో ఆరుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు శాఖలకు నిధులు విడుదల చేస్తూ... తొలి సంతకం చేశారు. ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టిన మంత్రులకు …నాయకులు , అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

వారం రోజుల క్రితం మంత్రులుగా ప్రమాణం చేసిన అమాత్యులు....సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసి తమకు కేటాయించిన ఛాంబర్లలోకి ప్రవేశించారు. ప్రజాభవన్‌లో గృహాప్రవేశం అనంతరం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క...ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు శాఖలకు నిధులు మంజూరు చేస్తూ సంతకాలు చేశారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీ కింద 374 కోట్ల రూపాయలు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి 298 కోట్లు, విద్యుత్‌ సబ్సిడీకి 996 కోట్ల రూపాయలు, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు 75కోట్ల రూపాయల్ని భట్టి విడుదల చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భట్టికి... పలువురు అధికారులు , పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ... ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు...వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి... రాష్ట్రంలోని 33 జిల్లాల DPROలకు అధునాతన కెమెరాలు అందచేసే దస్త్రాలపై తొలి సంతకం చేశారు. సీతక్క... పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించిన సీతక్కకు పలువురు కార్యకర్తలు, నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉదయం 9గంటల లోపే మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. మంత్రుల బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో అధికారులు, కార్యకర్తలు తరలిరావడంతో సచివాలయం వద్ద సందడి కనిపించింది

Tags

Read MoreRead Less
Next Story