TS POLLS: జోరుగా విపక్షాల ప్రచారం

TS POLLS: జోరుగా విపక్షాల ప్రచారం
ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్‌, బీజేపీ... ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేతలు..

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచార పర్వంలో మునిగిపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచార హోరు పెంచింది. అసంతృప్తులను బుజ్జగిస్తూ అగ్రనేతల పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. బీజేపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను బలంగా ఎత్తి చూపుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాన నేతలు బహిరంగసభలతో ముందుకెళ్తుంటే.. టిక్కెట్‌ వచ్చిన నాయకులు నియోజకవర్గాల్లో ప్రచారాలను ముమ్మరం చేశారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. రాంనగర్ చేపల మార్కెట్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన స్థానిక వ్యాపారస్తులను కలిసి కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.


LB నగర్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ప్రచారంలో భాగంగా హస్తినాపురం డివిజన్‌లోని పర్యటించారు. విరాట్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరిరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పట్టణంలోని చర్చి, మసీదు, రామాలయాల్లో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్క భారీ జన సందోహం మధ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ తనను గెలిపించాలని అభ్యర్థించారు.

మేడ్చల్ భారాస అభ్యర్థి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రచారంలో భాగంగా మేడ్చల్‌లోని మసీదుల్లో ప్రార్థనల అనంతరం ప్రచారం చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో పూజల తర్వాత డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోMLA సురేందర్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల చెంతకు వెళ్తున్నారు. జగిత్యాలలో సంజయ్‌కుమార్‌.. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పలు గ్రామాల్లో తుంగతుర్తి భారాస అభ్యర్థి గాదరికిషోర్ కుమార్ ప్రచారం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story