TS: తనిఖీలు ముమ్మరం.. భారీగా నగదు స్వాధీనం

TS: తనిఖీలు ముమ్మరం.. భారీగా నగదు స్వాధీనం
ప్రత్యేక చెక్‌పోస్ట్‌లో ఏర్పాటు చేసి తనిఖీలు... సామాన్యులకు తప్పని తిప్పలు

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి. ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు తీసుకెళ్లే వాళ్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌తో పాటు పండగల షాపింగ్ కోసం ప్రజలు చేతిలో డబ్బులు పెట్టుకొని ప్రయాణిస్తుండగా పోలీసులు మాత్రం అందరినీ ఒకే గాటిన కడుతున్నారు. ఎన్నికల నిబంధనల పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తనిఖీల్లో నగదు, బంగారం ఏదైనా బయటపడితే ఇక అంతే సంగతి సరైన పత్రాలు చూపించాలనిపోలీసులు హుకుం జారీ చేస్తున్నారు.


సోదాల్లో పట్టుబడిన సొమ్ము పిల్లల ఫీజు కట్టేందుకు లేదా పెళ్లి కోసం చీరలు, బంగారు కొనడానికి తీసుకెళ్తున్నామని చెప్పినా కొన్నిచోట్ల పోలీసులు పట్టించుకోవడం లేదు. హవాలా మార్గంలో డబ్బులు తరలించేవాళ్లను, అక్రమ బంగారం వ్యాపారం చేసే వాళ్లను... సామాన్యులను ఒకే తరహాలో చూస్తున్నారు. సరైన పత్రాలు చూపించకపోతే ఎన్నికల కోడ్ ప్రకారం స్వాధీనం చేసుకోవాల్సిందే అంటూ సమాధానం ఇస్తున్నారు. తనిఖీల ద్వారా ఇప్పటి వరకూ పట్టుకున్న సొమ్ము 168 కోట్లకు పైమాటే అని అధికారులు పేర్కొన్నారు. వారిలో హవాలా, బంగారు వర్తకులు, సిరాస్తి వ్యాపారులే అధికశాతం ఉన్నారు. మూడ్రోజుల క్రితం హైదరాబాద్‌ శివారులో ఓ వ్యక్తి వద్ద కోటి నగదు పట్టుబడింది. వనస్థలిపురంలో కారులో తరలిస్తున్న 29.40లక్షలు స్వాధీనం చేసుకున్న SOT పోలీసులు వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని రమ్య గ్రౌండ్స్ 26 లక్షలను బాలానగర్ SOT పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కుషాయిగూడ ఠాణాపరిధిలోనూ వాహన తనిఖీల్లో 30 లక్షలు చిక్కాయి. అబిడ్స్‌లో 5ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 21 లక్షల 94వేల 560 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నెక్లెస్ రోడ్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడి వద్ద నుంచి రెండు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్‌లో 27.5 కిలోల బంగారం, 15.6 కిలోల వెండి పట్టుబడింది. దాన్ని ఐటీ అధికారులకు అప్పగిస్తామని మియాపూర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ వెల్లడించారు. మరో వైపు తనిఖీల్లో లిక్కర్, గంజాయి భారీగా పట్టుబడుతోంది.. అత్యవసర పరిస్థితుల్లో నగదు తీసుకు వెళ్లాల్సివస్తే తగిన ఆధారాలు చూపాలని అధికారులు చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భారీఎత్తున నగదు పట్టుబడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story