Telangana Politics: తెలంగాణలో రాజకీయ వేడి

Telangana Politics:  తెలంగాణలో రాజకీయ వేడి
ఎవరు పార్టీ మారెనో ..

లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ తెలంగాణాలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఒకవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన.. మరొకవైపు నాయకులు భేటీలు, చేరికలతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ, భాజపా సీనియర్‌ నేత జితేందర్‌ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకాగా.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ని మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం కలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవ్వరూ పార్టీ మారతారో...ఎవరు పార్టీలో ఉంటారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

రాష్ట్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి..ప్రత్యర్థి పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇతర పార్టీలోని అసంతృప్త నేతలే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాయి. ఈక్రమంలోనే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌ భాజపా టికెట్‌ ఆశించి నిరాశకు గురైన జీతేందర్‌ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. టికెట్‌ రానంత మాత్రాన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని జితేందర్‌ రెడ్డికి తెలిపినట్లు సమాచారం. జితేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటే మల్కాజిగిరి లోక్‌సభ టికెట్‌ ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు జితేందర్‌ రెడ్డి సానుకూలంగా స్పందించలేదని, మరికొంత సమయం కావాలని సీఎంకు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జితేందర్‌ రెడ్డి భాజపాలోనే కొనసాగుతారా? లేక కాంగ్రెస్‌ గూటికి చేరి లోక్‌సభ బరిలో నిలుస్తారా అనే స్పష్టత రావాల్సి ఉంది.

రేవంత్‌ రెడ్డిపై మండి పడే మల్లారెడ్డి సైతం మౌనందాల్చారు. ఇటీవల మల్లారెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేతకు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నడుమమల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్‌ రెడ్డితో కలిసి సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డిని కలిశారు. ఈ భేటీతో మల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరుసటి రోజే కేటీఆర్‌ను కలిసి తాము పార్టీ మారటంలేదని భారాసలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డితోపాటు అల్లుడు రాజశేఖర్‌ రెడ్డిలు కలిశారు. వీరు కలిసినట్లు ఓ ఫోటో లీక్‌ కావడం, అది మీడియాలో చక్కర్లు కొట్టడంతో మరొకసారి మల్లారెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా తాను బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు డీకే శివకుమార్‌ను కలిసినట్లు మల్లారెడ్డి వెల్లడించారు. అందులో ఏలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. తాను భారాసలోనే కొనసాగుతానని మరోసారి స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లు తాను ప్రజా సేవ చేస్తానని ఆ తరువాత తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. కుమారుడు భద్రారెడ్డిని మాత్రం రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు....SPOT

Tags

Read MoreRead Less
Next Story