Medak Loksabha: బరిలో గెలుపుగుర్రాలే ..

Medak Loksabha: బరిలో గెలుపుగుర్రాలే ..
మెదక్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు పార్టీల ఎత్తులు

లోక్‌సభ ఎన్నికలుదగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వేసవి వేడితోపాటు రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుగుర్రాలనే బరిలో దింపేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన భారాస... అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎప్పట్నుంచో తమకు కంచుకోటగా ఉన్న మెదక్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందనరావును ఇక్కడ్నుంటి బరిలో నిలిపింది.

లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌, జహీరాబాద్‌ రెండు పార్లమెంట్‌ స్థానాలపై ఆసక్తి నెలకొంది. ఈ జిల్లాలో గజ్వేల్‌ నుంచి భారాస అధినేత కేసీఆర్‌, సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండూ మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఇది భారాసకు అత్యంత కీలకంగా మారింది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి విజయం వరకు గెలుపే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తొలినాళ్లల్లో ఎందరో ఆశావహుల పేర్లు వినిపించినా.. ఈ స్థానాన్ని మాజీ IAS వెంకట్రామిరెడ్డి దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన సీటు కాబట్టి ఆఖరి నిమిషంలో కేసీఆర్‌ బరిలో దిగినా.. ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక భాజపా వ్యూహాత్మకంగా దుబ్బాక మాజీ MLA రఘునందన్‌రావుకు మెదక్‌ స్థానాన్ని కేటాయించింది. ఇప్పటికే ఆయన ప్రచారంలోనిమగ్నమైపోయారు. ఈసారి మోదీ భరోసా పేరుతోనే భాజపా ప్రజల్లోకి వెళ్తోంది. ఇక కాంగ్రెస్‌.. మెదక్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇదివరకూ మల్కాజ్‌గిరి మాజీ MLA మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపించినా.. అధిష్ఠానం ఆయనపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆయనకు ఎదైనా నామినేటెడ్‌ పదవి ఇచ్చి సరిపెట్టాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పటాన్‌చెరు నుంచి BSP తరఫున పోటీ చేసి ఒటమి పాలై కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు పేరు బాగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మెదక్‌జిల్లాలో ముదిరాజ్‌ సామాజికవర్గం బలంగా ఉండటంతో ఆయన వైపే కాంగ్రెస్‌ అధినాయకత్వం మొగ్గుచూపే అవకాశముంది.

మరో లోక్‌సభ స్థానం జహీరాబాద్‌. దీనికి అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. భాజపా నుంచి బీబీపాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, భారాస నుంచి గాలి అనిల్‌కుమార్‌ని సత్తాచాటేందుకు సిద్దమవుతున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస యత్నిస్తుండగా..గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌, భాజపా ముందుకెళ్తున్నాయి. మెదక్‌ స్థానంలో పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండో జాబితాలో బరిలో దిగేదెవరో తేలే అవకాశముంది.

Tags

Read MoreRead Less
Next Story