Telangana Rains : వర్షాలు తగ్గాలని మంత్రి తలసాని పూజలు..

Telangana Rains : వర్షాలు తగ్గాలని మంత్రి తలసాని పూజలు..
Telangana Rains : తెలంగాణలో వర్షాలు కొద్దిగా తగ్గినా వరదలు మాత్రం వదిలిపెట్టడం లేదు.. ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో భారీగానే కనిపిస్తోంది..

Telangana Rains : తెలంగాణలో వర్షాలు కొద్దిగా తగ్గినా వరదలు మాత్రం వదిలిపెట్టడం లేదు.. ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో భారీగానే కనిపిస్తోంది.. కడెం ప్రాజెక్టు దగ్గర సాధారణ పరిస్థితులు కనిపిస్తుండగా, గోదావరి మహోగ్రంగా ప్రవహిస్తోంది.. అటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది.. ఇటు వరదలు కొనసాగుతుంటే, తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలెర్ట్‌ ప్రకటించింది వాతావరణ కేంద్రం. మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవంటోంది.

తెలంగాణలో వర్షం కొద్దిగా తెరపిచ్చింది.. కానీ, వరద పోటు మాత్రం తగ్గలేదు.. గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది.. గోదావరి అయితే మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవాహం కొనసాగుతోంది. ముందు జాగ్రత్తగా గోదావరి వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.

అటు, భద్రాచలం పట్టణంలోని లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. రామాలయం పరిసరాలు, అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీలు జలమయం అయ్యాయి. వరద ఉధృతి నేపథ్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో 144 సెక్షన్‌ విధించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరించారు.

కుండపోత వానలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఏటూరు నాగారం మండలంలో గోదావరి డేంజర్‌ లెవల్‌లో ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్‌ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కరకట్ట చుట్టూ లీకేజీలు ఏర్పడటంతో ఏటూరు నాగారం మండలంలో హై అలర్ట్ ప్రకటించారు. అవతలగూడ, ఓడగూడెం, ఎస్సీ కాలనీ వాసులను ఏటూరు నాగారంలోని వైటీసీ పునరావాస కేంద్రాలకు తరలించారు.

భద్రాచలంలో వరద బీభత్సంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం బతుకుంటే, విపత్తు సమయంలోనూ విధులను పక్కనపెట్టి అధికారులు విలాసాలు, జల్సాలతో గడుపుతున్నారు.. గోదావరి వరద సహాయక చర్యలను పక్కనపెట్టి కాంట్రాక్టర్లతో కలిసి మందు పార్టీ చేసుకున్నారు.. ఈ బాగోతం టీవీ5 కెమెరాకు చిక్కింది.. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మంచిర్యాల జిల్లా చెన్నూరులో వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్ కాపాడింది. సోమన్‌పల్లి వద్ద గోదావరిలో చిక్కుకుపోయిన ఇద్దరిని హెలికాఫ్టర్ సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నిర్మల్‌ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది.. రెండు రోజులుగా భారీ వరదతో ఆందోళన చెందిన అధికారులు.. వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రాజెక్టు గేట్ల భాగంలో భారీగా చెత్త పేరుకుపోయింది. అధికారులు యథతథంగా ప్రాజెక్టు దగ్గర విధులు నిర్వహిస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మర్రివాడలో ఊరు ఊరు అంతటినీ నీరు ముంచెత్తింది. వరద ముంపులోంచి క్షేమంగా బయటపడేందుకు ఓ కుటుంబం పెద్ద సాహసమే చేసింది. మూడు నెలల పసికందును బుట్టలో పెట్టుకుని.. దాన్ని తలపై ఉంచుకుని జాగ్రత్తగా కాలనీ దాటింది. మంథని పట్టణంతోపాటు చుట్టుపక్కల వరద విలయానికి ఈ దృశ్యం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

ఇక సిరిసిల్ల జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జులైలో 450 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని చెప్పారు. పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్‌లో అసాధారణ పరిస్థితులు ఉన్నాయని, సిరిసిల్ల జిల్లాలో ఈ స్థాయి వర్షం, వరదలు లేకపోయినా ఎవరూ ఉదాసీనంగా ఉండొద్దని అధికారులకు సూచించారు. ప్రాణనష్టం జరక్కుండా, ఆస్తి నష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలన్నారు.

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా వాడి పంచాయతీ పరిధిలోని బ్రిడ్జి కూలిపోయింది.. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.. బ్రిడ్జి కూలిపోయిన ప్రాంతాన్ని మంత్రి హరీష్‌ రావు పరిశీలించారు. 3 కోట్లతో త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

హన్మకొండ జిల్లా కంటాత్మకూరు, పరకాల మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ధర్మారెడ్డి పర్యటించారు.. క్యాంప్‌ ఆఫీస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు..

వర్షాలు తగ్గాలని కోరుతూ సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. వరుణ శాంతి యాగంలో పాల్గొన్నారు. అటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ శాంతి పూజలు చేశారు. దేవస్థానంలో శాంతి హోమాలు, వరుణ, ఇంద్ర జపాలు, యజ్ఞాలు నిర్వహించారు.

ఓవైపు వర్షాలు, వరదలతో జనం అల్లాడిపోతుంటే, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడక భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారిందని.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story