TS: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

TS: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిచనున్న గవర్నర్‌.... ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రేవంత్‌ సర్కార్....

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024 - 25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నీటిపారుదల అంశాలపై చర్చతో సమావేశాలు వేడెక్కనున్నాయి. రెండు నెలలలోపే గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి మరోమారు ప్రసంగించనున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం శాసనసభ మండలి సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఇవాళ ప్రసంగించనున్నారు.


ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు శాసనసభ సభా మందిరంలో సంయుక్త భేటీ జరగనుంది. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ తొమ్మిదో తేదీన రాష్ట్ర మూడో శాసనసభ మొదటిసారి కొలువు తీరింది. కొత్త శాసనసభ ఏర్పాటు అయిన సందర్భంగా ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. తాజాగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రెండు నెలల లోపే మరోమారు గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలి రేపటికి వాయిదా పడతాయి. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘాలు విడివిడిగా సమావేశం అవుతాయి. బడ్జెట్ సమావేశాల పనిదినాలు, ఎజెండాను బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్ లో రేపు చర్చ, సమాధానం ఉండనున్నాయి.


పదో తేదీన 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక ప్రణాళికను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే తరహాలో తెలంగాణలోనూ ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నీటిపారుదల అంశాలతో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. నీటిపారుదల రంగానికి సంబంధించి ఈ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన వ్యవహారంపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. నివేదిక ఆధారంగా ఇద్దరు ఈఎన్సీలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తప్పించింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆడిటింగ్ నిర్వహించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్ నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఔట్ లెట్లను అప్పగించే విషయమై రాష్ట్రంలో గత కొన్నాళ్లుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష భారాస పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని అంశాలపై శాసనసభ వేదికగా పూర్తిస్థాయిలో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story