TS: నేటి నుంచి "ప్రజా పాలన"కు శ్రీకారం

TS: నేటి నుంచి ప్రజా పాలనకు శ్రీకారం
జనవరి ఆరు వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు.... 3 వేల 714 అధికార బృందాల ఏర్పాటు...

ఎన్నికల హామీల అమలు దిశగా తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రజాపాలనకు శ్రీకారం చుడుతోంది. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి.రాష్ట్రంలోని 12 వేల 769పంచాయతీలు, 3 వేల 626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16 వేల 395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నారు. ఇందుకోసం 3 వేల 714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. సుమారు పది శాఖల అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో పర్యటించి ప్రజాసదస్సులు నిర్వహిస్తుంది. ఈ నెల 31, జనవరి 1 సెలవు రోజులు మినహా..... మిగతా రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు గ్రామ, వార్డు సభలు ఉంటాయి.ఈ సభల్లో మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇందుకోసం ఒకే దరఖాస్తును తయారు చేశారు. రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులను సమర్పించవచ్చునని బుధవారం దరఖాస్తు ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారులే గ్రామసభకు వెళ్లాల్సిన అవసరం లేదని వారి తరఫున ఎవరైనా దరఖాస్తు సమర్పించవచ్చునని వివరించారు.


ప్రజాపాలనను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు..ఐఏఎస్ లను నోడల్ అధికారులుగా నియమించారు. దరఖాస్తులు సమర్పించే క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం సుమారు 22 కోట్లు మంజూరుచేసింది. ప్రజా పాలనను ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఆరుగ్యారంటీల్లో ఐదు పథకాలకు ఒకే దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు ఒకే దరఖాస్తును నింపాలి. ఆధార్, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని జత పరచాలి. ఇప్పటికే ఫించను పొందుతున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసే ఉద్యమకారులు F.I.R నంబరును ప్రస్తావించాలి. దరఖాస్తుల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పథకాల కోసం ఒకే దరఖాస్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాలి. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాల వంటి పది అంశాలను పూరించాలి. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story