Hyderabad Rains: హైదరాబాద్ వాతావరణం.. మరో మూడు రోజుల వరకు..

Hyderabad Rains: హైదరాబాద్ వాతావరణం.. మరో మూడు రోజుల వరకు..
Hyderabad Rains: భాగ్యనగరాన్ని భారీ వర్షం మరోసారి ఉలిక్కడి పడేలా చేసింది.

Hyderabad Rains: భాగ్యనగరాన్ని భారీ వర్షం మరోసారి ఉలిక్కడి పడేలా చేసింది. దాదాపు రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షానికి నగరం చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షానికి రహదారులన్నీ వాగులను తలపించాయి. నగరవాసులు ఇళ్లకు చేరుకునే సమయంలో వర్షం మొదలవడంతో ఎక్కడికక్కడ రోడ్లపక్కన జనం తలదాచుకున్నారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జనం ఉక్కిరిబిక్కిరయ్యారు.

శుక్రవారం రాత్రి నగరంలోని చాలా చోట్ల వర్షం పడింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మణికొండ, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పురా,రామ్‌నగర్‌ తోపాటు.. పాతబస్తీ, గోల్కొండ, చంపాపేట్‌, సైదాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి విజయవాడ జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది.

సుష్మా, పనామా, చింతల్‌కుంట కూడళ్లలో మోకాలిలోతు నీరు నిలిచింది. దీంతో హయత్‌ నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. చంపాపేటలో ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌ పడిపోయినట్లు వార్త రావడంతో పెను కలకలం సృష్టించింది. అతడు సురక్షితమే అంటూ వార్త రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. భారీవర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పలుచోట్ల భారీగాట్రాఫిక్ జామ్ అయింది. షాపులు, ఇళ్లలోకి నీరు చేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి.. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే, ఇంజనీరింగ్ అధికారులతో పర్యటించి .. వరద నివారణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నిలిచిఉండే నీరు సాఫీగా వెళ్లేలా మాన్సూన్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. అవసరమైతే డీఆర్ఎఫ్‌ బృందాలను కూడా సిద్దంగా ఉండాలని సూచించారు.

ఏవైనా సమస్యలు వస్తే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040-21111 111కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. హైదరాబాద్‌లోని లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్లు వర్షం కురిసింది. కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.8, మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1, రెయిన్‌ బజార్‌లో 7.7, అత్తాపూర్‌లో 6.9, రాజేంద్రనగర్‌, శివరాంపల్లిలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కిందిస్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం.... మరింత బలహీనపడినట్టు పేర్కొంది.

ఈనెల 10న ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story