రక్తం రుచిమరిగిన పులి దాడులపై జనం ఆందోళన

రక్తం రుచిమరిగిన పులి దాడులపై జనం ఆందోళన

పులుల సంరక్షణార్థం ఆదిలాబాద్ జిల్లాలో 2012లో కవ్వాల్ జాతీయ పులుల సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకు ముందే ఉమ్మడి ఆదిలాబాద్‌లోని దట్టమైన అడవుల్లో పులులు అక్కడక్కడా సంచరిస్తూ ఉండేవి. అయితే ఇక్కడ పులుల సంఖ్య పెద్దగా పెరిగిన దాఖలాలు మాత్రం లేవు. మరోవైపు కాగజ్ నగర్ అడవుల్లో చాలా కాలంగా పులులు ఉండేవి. ఈ ప్రాంతానికి మహారాష్ట్రలోని తాడోబా టైగర్ జోన్ నుంచి పులుల రాకపోకలు సాగుతూ ఉండేవి. కవ్వాల్ టైగర్ జోన్‌కు సైతం తాడోబా నుండి కారిడార్‌గా ఈ ప్రాంత అడవులు ఉన్నాయి. కవ్వాల్‌కు కొన్ని పులులు వచ్చి మళ్లీ తిరిగి వెళుతుండటం అటవీశాఖను కలవరానికి గురిచేసింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా నెలరోజుల క్రితం దహేగం మండలం దిగడలో విగ్నేష్‌ను, పెంచికల్ పేట మండలం కొండపల్లిలో నిర్మలపై కొన్ని రోజుల వ్యవధిలోనే పులి దాడి చేసి చంపేసింది. దీంతో ఈ ప్రాంతవాసుల్లో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. నిర్మల, విగ్నేష్‌ కుటుంబసభ్యులకు.. అటవీశాఖలో ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే.. ప్రభుత్వం మళ్లీ తమ పిల్లలను పులి దగ్గరకే పంపే వాచర్ జాబ్ ఎందుకని ఆవేదన చెందుతున్నారు.

అడవి సమీపంలో పంటపొలాలు ఉండటంతో అటు వైపు వెళ్లేందుకు, పనులు చేసుకొనేందుకు స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికే పత్తి పంట చేతికి రావడం దాన్ని ఏరడానికి కూలీలు ముందుకు రాకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది.

ప్రస్తుతం కాగజ్ నగర్ అడవుల్లో 8 నుంచి 12 వరకు పెద్ద పులులు ఉంటాయని అటవిశాఖ అధికారులు అంటున్నారు. అయితే అటవీ శాఖ అంచనా ప్రకారం పులుల సంఖ్య పెరగడంతో సరిపడా ఆహారం లభించక గ్రామాల్లో పశువుల పైన దాడులు చేస్తున్నాయి. మనుషులను కూడా చంపడానికి ఇదొక కారణమని అటవీ శాఖ భావిస్తోంది. స్థానికుల మాటల్లో చెప్పాలంటే.. మనిషి రక్తం రుచి మరిగిన పులి.. అటవీ సమీప చేలల్లోకి వచ్చేవారిపై దాడి చేస్తోందని అంటున్నారు.

పెద్ద పులిని త్వరగా పట్టుకుంటామని చెప్పిన అటవీశాఖ అధికారులు చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మనుషులుపై దాడి జరిగి నెల గడిచినా ఒక్క పులిని కూడా పట్టుకోలేకపోవడాన్ని స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదాలకు దిగుతున్నారు. అటవీ శాఖ కార్యాలయం ముట్టడి, ధర్నాలు చేస్తున్నారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులైతే అటవీశాఖకు పులులను పట్టుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదని.. వారిని నిజంగా పట్టుకోవాలని ఉంటే.. మనుషులపై దాడి జరిగిన చోట బోన్లు ఏర్పాటు చేసే వారిని అభిప్రాయ పడుతున్నారు.

పులికి సంబంధించిన కనీస సమాచారాన్ని కూడా అటవీశాఖ అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకు పెద్దపులికి సంబంధించిన ఆచూకీ కనిపెట్టలేక పోయారు. అటు.. పులి భయంతో... పనులకు వెళ్లలేక... ఉపాధి కోల్పోయి పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు... పులుల సంఖ్య పెరగడం మంచి పరిణామమే అయినా అవి అడవిని దాటి గ్రామాల్లోకి రావడమే జనం ప్రాణాల మీదకు వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story