రక్తం మరిగిన పులి.. మ్యాన్‌ ఈటర్‌గా మారిందనే ఆందోళన

రక్తం మరిగిన పులి.. మ్యాన్‌ ఈటర్‌గా మారిందనే ఆందోళన

రక్తం మరిగిన పులి మనుషుల మీద విరుచుకుపడుతోంది.. 18 రోజుల్లో ఇద్దరిని పొట్టన పెట్టుకుంది.. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు.. ఎప్పుడు ఎటు నుంచి దాడిచేస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నారు.. కొద్దిరోజుల క్రితం పొలానికి వెళ్లిన ఓ యువకుణ్ని పెద్దపులి చంపేయగా.. ఆదివారం ఆసిఫాబాద్‌ జిల్లాలో పత్తి చేనుకు వెళ్లిన బాలికను బలితీసుకుంది. దీంతో అటవీ సరిహద్దు గ్రామాలు భయాందోళన చెందుతున్నాయి.

ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలంలోని కొండపల్లికి గ్రామానికి చెందిన గిరిజన బాలిక నిర్మల ఆదివారం పెద్దపులి దాడిలో మృతిచెందింది. అటవీ ప్రాంతానికి సమీపంలోని పత్తి చేనుకు వెళ్లింది.. పత్తి తీస్తున్న సమయంలో ఒక్కసారిగా పులి దాడిచేసి బాలికను ఈడ్చుకెళ్లింది.. ఆమె అరుపులతో మిగతా కూలీలు భయపడ్డారు. మిగిలిన కూలీలు కర్రలతో వెంబడించినా అప్పటికే ఆమె పులి దాడిలో ఆమె మృతిచెందింది.. కూలీల కేకలతో పులి బాలిక మృతదేహాన్ని వదలి వెళ్లిపోయింది. మృతదేహాన్ని తీసుకొస్తుండగా మరోసారి పెద్దపులి దాడిచేసేందుకు ప్రయత్నించగా.. గ్రామస్తులు ప్రతిఘటించడంతో అది అడవిలోకి పారిపోయింది.

కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లోని బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట ప్రాంతాల్లో ఇటీవల పెద్దపులి దాడులు పెరిగిపోయాయి. ఈనెల 11న దహెగాం మండలం దిగడలో పొలానికి వెళ్లిన విఘ్నేష్‌ అనే యువకుడిపై పులి దాడిచేసింది.. శరీరంలోని వెనుక భాగాన్ని తినేసింది.. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు పులిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశారు.. అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడే మకాం వేసినా ఫలితం లేకపోయింది. మొదట విఘ్నేశ్‌పై దాడిచేసింది ఈ ప్రాంతానికి చెందిన పులి కాదని తేల్చిన అధికారులు.. మహారాష్ట్ర వెళ్లిపోయి ఉంటుందని భావించారు..తాజా ఘటనతో మరోసారి గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.. దిగిడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే కొండపల్లి ఉంటుంది. ఇక్కడి నుంచి మరో 15- 20 కిలోమీటర్ల దూరంలో కాగజ్‌నగర్‌ కడంబా అడవులు ఉంటాయి. కొండపల్లిలో యువతిని చంపిన పులి కడంబా అడవుల వైపు వెళ్లి ఉండవచ్చని అటవీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు పులి భయంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో 11 వరకు పులులు గర్జిస్తున్నాయి. కుమురంభీం జిల్లా బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట అడవుల్లోనే ఎనిమిది తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇవి మనుషులపై దాడి చేయలేదు. అడవులకు మేతకు వెళ్లిన పశువులను మాత్రమే చంపేసేవి.. ఈ నెల 11న విఘ్నేశ్‌ను చంపిన అనంతరం ఈ మూడు మండలాల్లో ప్రజలకు తరచూ పెద్దపులి కనిపిస్తూనే ఉంది.

బెజ్జూరు, దహెగాం, పెంచికల్‌పేట ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం గుండా వివిధ అవసరాల కోసం పల్లె వాసులు కాగజ్‌నగర్‌ వెళ్తుంటారు.. ఈ ప్రాంతంలోనే పులులు నిత్యం తిరుగుతుంటాయి. కొంతమంది యువకులు పులి సంచారాన్ని సెల్‌ఫోన్‌లో తీసి సోషల్‌ మీడియాలో కూడా పెట్టారు. మరోవైపు వరుస దాడుల నేపథ్యంలో పులి మ్యాన్‌ ఈటర్‌గా మారిందా అనే ఆందోళన ఇటు ప్రజల్లోనో, అటు అధికారుల్లోనూ కలుగుతోంది.. మూడు నెలల క్రితం కాగజ్‌నగర్‌ మండలం నారాపూర్‌ శివారులో పులి పంట పొలాల్లో తిరుగుతున్నట్టు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పులిని బందించేందుకు అటవీ అధికారులు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story